Mahaa Daily Exclusive

  మోదీ రాకతో తెలంగాణలో బిజెపి ప్రభంజనం…

Share

  • మోదీ రాకతో తెలంగాణలో బిజెపి ప్రభంజనం
  • డైవర్షన్ పాలిటిక్స్‌లో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు
  • విద్యుత్ కొనుగోళ్ల విచారణ అంతా డ్రామా
  • పాడి కౌశిక్ రెడ్డి ఒక ‘కార్టూన్ క్యారెక్టర్’
  • బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలి.
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలపై బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్

హైదరాబాద్, మహా : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పునకు నాంది కాబోతోందని, మోదీ పట్ల ప్రజల్లో కనిపిస్తున్న అఖండ స్పందన చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్ అన్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్దమయ్యారన్నారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బిజెపి శరవేగంగా ఎదుగుతోందని, అభివృద్ధి కావాలంటే బిజెపి అధికారంలోకి రావాలనే నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చారన్నారు. ఇప్పటికే కేంద్రం సుమారు రూ.12.5 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతులు, ప్రాజెక్టులను తెలంగాణకు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు.

మోదీ సభకు వస్తున్న ప్రజా స్పందనను దారి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘విద్యుత్ కొనుగోలు విచారణ’ పేరుతో కొత్త డ్రామాలు ఆడుతోందని సుభాష్ విమర్శించారు. రెండేళ్ల కిందటి లోకూర్ కమిషన్ నివేదికపై ఇప్పుడు అకస్మాత్తుగా కేబినెట్ మీటింగ్ పెట్టి సీబీఐ విచారణ కోరడం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనన్నారు. కేరళంలో కాంగ్రెస్ గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్పలకు పోయి కేరళంలో యూడీఎఫ్ విజయానికి తానే కారణమన్నట్లుగా ఒక కొత్త నెరేటివ్ తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, తీరా వారి సొంత పార్టీ నుంచే అసంతృప్తి వ్యక్తమైందని, తెలంగాణ నిధులనే కేరళంలో ఖర్చు చేశారనే చర్చ జరుగుతోందని ఆయన ఆరోపించారు.

పాడి కార్టూన్ క్యారెక్టర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఒక ‘కార్టూన్ క్యారెక్టర్’లా ఉందని సుభాష్ తీవ్రంగా విమర్శించారు. హుజూరాబాద్‌లో అనుకోకుండా గెలిచిన కౌశిక్ రెడ్డి, బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం శవ రాజకీయాలు చేసే సంస్కృతి ఆయనదని, అటువంటి వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాజకీయ దివాళాకోరుతనమని పేర్కొన్నారు. బండి సంజయ్ లవంగం వేసుకుంటే దాన్ని తంబాకు అని కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు విష ప్రచారం చేస్తున్నారని సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “బండి సంజయ్ దేవుడి మీద ప్రమాణం చేసి తాను తంబాకు తిననని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి గానీ, కేటీఆర్ గానీ తాము డ్రగ్స్ తీసుకోవడం లేదని ప్రమాణం చేయగలరా? డీఎన్ఏ టెస్టుకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరితే ఇప్పటివరకు సమాధానం లేదన్నారు. బండి సంజయ్ ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, కార్పొరేటర్‌గా, ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, తిరిగి ఎంపీగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎదిగారని గుర్తుచేస్తూ, అలాంటి నాయకుడిపై చౌకబారు ఆరోపణలు చేసి రాజకీయ గుర్తింపు పొందాలని ప్రయత్నించడం కౌశిక్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల కూడా కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కేటీఆర్, కౌశిక్ రెడ్డి వంటి నాయకులు అసభ్య రాజకీయ భాషను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌లో శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు. గత పదేళ్లు హోం శాఖ వారి చేతిలోనే ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వైఫల్యాలను వదిలేసి బిజెపిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడులు జరిగాయని, బిజెపి ఎప్పుడూ దాడులను ప్రోత్సహించదని, కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తల ఆగ్రహానికి బాధ్యత వారే వహించాల్సి ఉంటుందని సుభాష్ హెచ్చరించారు.

కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కేవలం హాజరు కోసం వచ్చి వెళ్తున్నారని, ప్రజా సమస్యలపై పోరాడే దమ్ము బీఆర్ఎస్‌కు లేదని సుభాష్ విమర్శించారు. 2014 నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతోనే పని చేస్తున్నాయని, బిజెపిని అడ్డుకోవడమే వారి ఏకైక లక్ష్యమని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు బిజెపినే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని, మోదీ పర్యటనతో అది మరింత స్పష్టమవుతోందని సుభాష్ స్పష్టం చేశారు.