- బెంగాల్ సీఎంగా మహిళా నేత
- మోడీ, షా దృష్టిలో అగ్నిమిత్ర పాల్ పేరు
- గట్టి పోటీ ఇస్తున్న సువేంద్రు అధికారి
- రేసులో సమిక్ భట్టాచార్య
కోల్ కతా, మహా : పశ్చిమ బెంగాల్ పీఠాన్ని మహిళకే కట్టబెట్టాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన బీజేపీ తొలిసారిగా అక్కడ అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 293 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయడంతో, ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపైనే ఉంది. ఈ రేసులో ముగ్గురు కీలక నేతల పేర్లు బలంగా వినిపిస్తుండగా, అందులో అగ్నిమిత్ర పాల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అసన్సోల్ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ పేరు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన అగ్నిమిత్ర, రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశారు. తాజా ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థిపై సుమారు 40,839 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం ఆమె బలాన్ని చాటిచెప్పింది. ఒకవేళ బీజేపీ హైకమాండ్ మహిళా నేతకు పట్టం కట్టాలని భావిస్తే, మమతా బెనర్జీకి ధీటైన ప్రత్యామ్నాయంగా అగ్నిమిత్ర పాల్కే మొదటి అవకాశం దక్కవచ్చు.
ముఖ్యమంత్రి పదవికి మరో బలమైన పోటీదారుగా ప్రతిపక్ష నేత సువేందు అధికారి నిలుస్తున్నారు. ముఖ్యంగా భబానీపూర్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 15,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించి, ఆమెకు కంచుకోట లాంటి చోట షాక్ ఇచ్చారు. నందిగ్రామ్ తర్వాత ఇప్పుడు భబానీపూర్లోనూ దీదీని ఓడించడంతో, పార్టీలో ఆయన ప్రాధాన్యత అమాంతం పెరిగింది. క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న నాయకుడిగా సువేందు పేరును పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు. వీరిద్దరితో పాటు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సమిక్ భట్టాచార్య పేరు కూడా సీఎం అభ్యర్థుల పరిశీలనలో ఉంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, వివాదరహితుడైన నాయకుడిగా ఆయనకు ఢిల్లీ పెద్దల వద్ద మంచి గుర్తింపు ఉంది. పార్టీ సీనియర్లు, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఆయనకు ఉండటం అదనపు బలంగా మారుతోంది.
మే 9న ప్రమాణ స్వీకారం
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని మే 9వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అగ్నిమిత్ర పాల్ రూపంలో ఒక మహిళకు అవకాశం ఇస్తారా? లేక మమతను మట్టికరిపించిన సువేందును ఎంచుకుంటారా? అన్నది మరో 24 గంటల్లో తేలిపోనుంది. అగ్నిమిత్ర పాల్ ఎంపిక జరిగితే, అది బెంగాల్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది. సువేందు అధికారి అనుభవం, అగ్నిమిత్ర ఇమేజ్ మధ్య బీజేపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. నిన్నటి వరకు బెంగాల్ ను ఏలిన దీదీపై రాజీలేని పోరాటం చేసిన బీజేపీ తాజా పరిస్థితులలో కీలక నేతలెవరినీ నొప్పించకుండా ప్రభుత్వాధినేతను ఎంపిక చేయాలని భావించింది. అయితే ఇప్పటికే అగ్నిమిత్ర పాల్ అభఅయర్థిత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు ఒక నిర్ణయానిక వచ్చారని, మహిళా ఎలుబడిలో 15 ఏళ్ళుు సాగిన దీదీ పాలనను ప్రస్తుతం ఎంపిక చేయనున్న మహిళా పాలనపై కొల్ కత్తా ప్రజలతో పాటు దేశ వ్యాప్త చర్చకు పెట్టాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.







