Mahaa Daily Exclusive

  మహిళా లోకానికి మహర్దశ….. వడ్డీ లేని రుణం ఇక రూ. 10 లక్షలు….

Share

 

హైదరాబాద్, మహా.
తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి కాలంలో చల్లని కబురు అందించింది. పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సంఘాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో, ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ లేని రుణ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పెంచిన ఈ రూ. 10 లక్షల బ్యాంకు రుణాలపై అయ్యే పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
గురువారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందాల వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ అనే నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని, ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. గతంలో మహిళలకు పది వేల రూపాయల రుణం లభించడమే గగనంగా ఉండేదని, కానీ నేడు బ్యాంకులు పోటీ పడి లక్షలాది రూపాయల రుణాలు అందిస్తున్నాయని ఆమె గుర్తు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ. 25,228.89 కోట్ల మేర రుణాలు అందించగా, ఈ ఏడాది వడ్డీల చెల్లింపు కోసమే ప్రభుత్వం అదనంగా రూ. 2,500 కోట్లు కేటాయించనుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క తన గతాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు వడ్డీ వ్యాపారుల దోపిడీకి సామాన్య ప్రజలు బలైపోతుంటే చూడలేక, పేదరికం నుంచి విముక్తి కోసం తాను తుపాకీ పట్టి అడవి బాట పట్టానని ఆవేదనతో చెప్పారు. ఆనాడు తాను అనుభవించిన పేదరికం, చూసిన అన్యాయమే నేడు మంత్రిగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాలనే బలమైన సంకల్పాన్ని ఇచ్చాయని ఆమె పేర్కొన్నారు. కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40 శాతం బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించినట్లు ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.
బ్యాంకు రుణాల తిరిగి చెల్లింపు విషయంలో మహిళా సంఘాలు చూపుతున్న క్రమశిక్షణపై మంత్రి ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో వంద శాతం రికవరీ సాధించి ‘జీరో ఎన్పీఏ’గా నిలవడం గర్వకారణమని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుందని, రీపేమెంట్ విషయంలో పూర్తి బాధ్యత తమదేనని బ్యాంకర్లకు ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, స్త్రీ నిధి డిప్యూటీ ఎండీ శ్రీనాథ్ మరియు పలువురు బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.