- అవసరం లేకున్నా ఆపరేషన్.
- యశోదా ఆస్పత్రికి రూ. 50 లక్షల భారీ జరిమానా.
హైదరాబాద్, మహా.
‘దేవుడా అని మొక్కితే దయ్యమయినట్లు’.. ఓ మహిళ పరిస్థితి అలాగే తయారైంది. అనారోగ్యం నుంచి విముక్తి కలిగిస్తారని ఆశతో ఆస్పత్రికి వెళ్తే, ఆ వైద్యుల నిర్లక్ష్యం ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. అవసరం లేకున్నా శస్త్రచికిత్స చేసి, బాధితురాలిని మంచాన పడేసిన ఘటనలో హైదరాబాద్ మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రికి జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 50 లక్షల పరిహారంతో పాటు, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 20 వేలు చెల్లించాలని స్పష్టం చేస్తూ కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. త్రిపుర రాష్ట్రంలోని ఉదయ్‌పుర్‌కు చెందిన ఝుమనాథ్ గత కొంతకాలంగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో ఆమెకు ‘ఎల్5 ఎస్1 గ్రేడ్-1 స్పాండిలోలిస్థెసిస్’ (స్లిప్‌డిస్క్) సమస్య ఉన్నట్లు తేలింది. యశోదా ఆస్పత్రికి చెందిన ఓ స్పైన్ సర్జన్ త్రిపుర పర్యటనలో ఉండగా ఆమెను పరీక్షించి, శస్త్రచికిత్స చేస్తే సమస్య పూర్తిగా నయమవుతుందని భరోసా ఇచ్చారు. వైద్యుడి మాటలు నమ్మిన ఆమె, 2019 మే 16న మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చేరారు. మరుసటి రోజే వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు.
అయితే, శస్త్రచికిత్స తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. తీవ్రమైన వెన్నునొప్పికి తోడు జ్వరం, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు చుట్టుముట్టాయి. కనీసం నడవలేక, కూర్చోలేక, తన సొంత పనులు కూడా చేసుకోలేనంతగా బాధితురాలు ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. వైద్యుల లాభాపేక్ష, నిర్లక్ష్యం వల్లే తన జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఈ ఫిర్యాదుపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కమిషన్, వైద్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. సాధారణంగా గ్రేడ్-1 స్థాయిలో ఉండే వెన్ను సమస్యలకు ఫిజియోథెరపీ, మందులతోనే చికిత్స అందించవచ్చని, శస్త్రచికిత్స అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆస్పత్రిలో సరైన ఎంఆర్‌ఐ స్కాన్ చేయకుండానే, కేవలం గ్రేడ్-1 సమస్యను గ్రేడ్-2గా మార్చి ఆపరేషన్ చేయడం కేవలం నిర్లక్ష్యమేనని కమిషన్ స్పష్టం చేసింది. వైద్యులు సంప్రదాయ చికిత్స పద్ధతులను విస్మరించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ.. ఆస్పత్రి యాజమాన్యం, సర్జన్‌లను బాధ్యులుగా చేస్తూ ఈ భారీ జరిమానా విధిస్తూ ఉత్తర్వులిచ్చింది.








