హైదరాబాద్, మహా.
తమిళనాడు రాజకీయాలు మరోసారి రిసార్టు రాజకీయాలకు వేదికయ్యాయి. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అన్నాడీఎంకే అప్రమత్తమైంది. సుమారు 28 మంది ఎమ్మెల్యేలను హుటాహుటిన పొరుగునే ఉన్న పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్టుకు తరలించింది. వీరంతా అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం మద్దతుదారులని ప్రచారం జరుగుతుండటంతో అటు పార్టీలోనూ, ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర కలకలం రేగుతోంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
**పవర్ షేరింగ్‌పై తెరవెనుక చర్చలు!**
రాష్ట్ర అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో ఆగిపోయిన విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చి, ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని అన్నాడీఎంకేలోని ఒక వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీవీకే నేత సెంగోట్టయ్యన్‌తో అన్నాడీఎంకే సీనియర్ నేతలు రహస్య చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల్లో భాగంగా సి.వి. షణ్ముగంకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రి పదవులు ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను షణ్ముగం పుదుచ్చేరికి తరలించారని, రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
**అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు**
మరోవైపు, టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రతిపాదనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి (ఈపీఎస్) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విజయ్ పార్టీతో జతకట్టడం వల్ల భవిష్యత్తులో పార్టీ ఉనికికే ప్రమాదమని ఆయన భావిస్తున్నారు. అయితే, సీవీ షణ్ముగం, ఓఎస్ మణియన్ వంటి నేతలు మాత్రం అధికారంలోకి వచ్చే అవకాశాన్ని జారవిడుచుకోకూడదని పట్టుబడుతున్నారు. ఈ నాయకత్వ పోరు చివరకు పార్టీలో చీలికకు దారితీస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే చట్టపరమైన మార్గాలను అన్వేషించాలని లేదా తిరిగి ఎన్నికలకు వెళ్లాలని ఈపీఎస్ వర్గం భావిస్తుంటే, షణ్ముగం వర్గం మాత్రం అధికార పంపిణీ వైపే మొగ్గు చూపుతోంది.
**గవర్నర్ వద్దకు విజయ్.. మెజారిటీ నిరూపణే సవాల్**
ఈ రాజకీయ గందరగోళం మధ్య టీవీకే అధినేత విజయ్ గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను మరోసారి కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరగా, మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పూర్తి జాబితాను, మెజారిటీకి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని గవర్నర్ స్పష్టం చేశారు. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీకి 118 సీట్లు అవసరం కాగా, టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లు సమాచారం ఉన్నప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడానికి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు అత్యవసరం. ఈ ఆరుగురి కోసం అన్నాడీఎంకే వైపు టీవీకే నేతలు చూస్తుండటంతో తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది.
**పార్టీ ఐక్యంగానే ఉంది: సత్యన్**
పరిణామాలు వేగంగా మారుతున్నా, అన్నాడీఎంకేలో ఎలాంటి చీలికలు లేవని పార్టీ అధికార ప్రతినిధి సత్యన్ స్పష్టం చేశారు. పార్టీ ఐక్యంగానే ఉందని, టీవీకేతో చర్చలు జరిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే తుది నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని, అంతవరకు కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. బుధవారం టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ నేరుగా పళనిస్వామితో సమావేశం కావడం, ఆ తర్వాత ఎమ్మెల్యేల తరలింపు చోటుచేసుకోవడం చూస్తుంటే తమిళనాడు పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మరింత పెరిగింది.
ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా, అన్నాడీఎంకే మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారా లేక తమిళనాడులో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తుతుందా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.








