Mahaa Daily Exclusive

  ఉగ్రస్థావరాలకు ఇక నూకలు చెల్లినట్లే….

Share

ఉగ్రస్థావరాలకు ఇక నూకలు చెల్లినట్లే.
* ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ముగింపు కాదు.. ఆరంభం!
హైదరాబాద్, మహా.
పాకిస్థాన్‌ గడ్డపై ఉన్న ఏ ఉగ్రవాద స్థావరం కూడా ఇకపై సురక్షితం కాదని భారత సైన్యం మరోసారి స్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశానికి బుద్ధి చెప్పేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం ఒక ముగింపు కాదని, అది భారత నవ శకానికి ఆరంభం మాత్రమేనని ఉద్ఘాటించింది. గడచిన అర్ధ శతాబ్ద కాలంలో భారత్ చేపట్టిన అత్యంత భారీ మరియు విస్తృతమైన పోరాట మిషన్‌గా దీనిని అభివర్ణించింది. ఈ చారిత్రాత్మక ఆపరేషన్ నిర్వహించి నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా జైపుర్‌లో త్రివిధ దళాల అధిపతులు నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశం శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలను పంపింది.
**వ్యూహాత్మక పాఠం.. స్వదేశీ అస్త్రాల శౌర్యం**
ఆపరేషన్‌ సిందూర్‌ ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యూహాలకు ఒక కొత్త పాఠంగా నిలిచిందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‍‌ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్‌ ఘాయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిఘా వర్గాలు, బీఎస్ఎఫ్, సైన్యం వంటి వివిధ విభాగాలు ఒకే లక్ష్యం కోసం సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ముఖ్యంగా బ్రహ్మోస్, ఆకాశ్‌ వంటి స్వదేశీ ఆయుధాలు ఈ పోరులో నిర్ణయాత్మక పాత్ర పోషించాయని, భారత రక్షణ రంగం స్వయం సమృద్ధిని ప్రపంచానికి చాటాయని కొనియాడారు. “ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, భారత్ తన పాత పద్ధతులను పక్కన పెట్టి, శత్రువును ఏరివేసే విషయంలో ఎంతటి కచ్చితత్వం, స్పష్టమైన లక్ష్యంతో ఉందో చెప్పడానికి నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు. భారత ప్రజలు, భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
**ఆకాశం నుంచి విరుచుకుపడ్డ పిడుగులు: 13 పాక్ విమానాలు ధ్వంసం**
వాయుసేన శక్తిసామర్థ్యాలు ఈ ఆపరేషన్‌లో మరోసారి నిరూపితమయ్యాయని అప్పటి వైమానిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్, ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి వివరించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేన పాకిస్థాన్‌కు చెందిన 13 యుద్ధ విమానాలను నేలమట్టం చేసిందని ఆయన వెల్లడించారు. సరిహద్దు దాటి వెళ్ళిన భారత బలగాలు పాక్‌లోని 11 ఎయిర్‌ఫీల్డ్‌లపై విరుచుకుపడ్డాయని, మే 7 అర్ధరాత్రి జరిగిన ఈ దాడుల్లో 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. సుమారు 300 కిలోమీటర్లకు పైగా రికార్డు దూరంలో ఉన్న ఒక అత్యంత విలువైన వైమానిక ఆస్తిని కూడా కూల్చివేసినట్లు ఆయన గుర్తు చేశారు. పాక్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను కొట్టిపారేస్తూ, ఈ విజయానికి సంబంధించిన అన్ని ఆధారాలు ప్రపంచం ముందు ఉన్నాయని స్పష్టం చేశారు.
**పహల్గాం రక్తపాతానికి ప్రతీకారం**
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన కిరాతక ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత్ ఈ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహావేశాలకు స్పందనగా, ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం శత్రువును వారి స్థావరాల్లోనే దెబ్బతీయాలని నిర్ణయించింది. పహల్గాం ఘటన జరిగిన కొద్ది రోజులకే మే 7 అర్ధరాత్రి భారత సైన్యం నిప్పులు చిమ్ముతూ సరిహద్దులు దాటి పాక్ ఉగ్రవాద మూలాలను పెకిలించివేసింది. నేటితో ఈ ఘటనకు ఏడాది పూర్తైన వేళ, భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యాన్ని దేశం మరోసారి స్మరించుకుంటోంది.