ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.
* ఆన్లైన్ మందుల విక్రయాలపై ఫార్మాసిస్ట్ల సమరభేరి.
* ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా ఏఐఓసీడీ సమ్మె పిలుపు.
* కోవిడ్ కాలం నాటి ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్.
* మూతపడనున్న 12.40 లక్షలకు పైగా మందుల దుకాణాలు.
హైదరాబాద్, మహా.
దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు మూతపడనున్నాయి. ఆన్లైన్ విధానంలో మందుల విక్రయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ సేవలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా భారీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సమ్మె కారణంగా దేశం నలుమూలలా ఉన్న సుమారు 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులు ఒకేరోజు పూర్తిగా మూతపడనున్నాయి. తద్వారా ఆన్లైన్ ఫార్మసీల వల్ల తలెత్తుతున్న ముప్పును ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఏఐఓసీడీ కంకణం కట్టుకుంది.
ఆన్లైన్ ఫార్మసీల ముసుగులో నకిలీ, నాసిరకం మరియు ప్రమాదకరమైన మందులు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి కఠిన నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ ఆన్లైన్ విక్రయాల వల్ల ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని వారు ఆరోపిస్తున్నారు. కేవలం లాభాల కోసమే కొన్ని సంస్థలు నిబంధనలను తుంగలో తొక్కుతూ ఎడాపెడా నాణ్యత లేని ఔషధాలను ప్రజల ఇళ్లకు పంపిస్తున్నాయని, సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తరహా ఆన్లైన్ సేవలకు తక్షణమే పూర్తిస్థాయిలో ఫుల్స్టాప్ పెట్టాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా కరోనా (కోవిడ్-19) విపత్కర పరిస్థితుల సమయంలో అత్యవసర సేవల నిమిత్తం మందుల ఆన్లైన్ విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అనుమతులు, ఆదేశాలు జారీ చేసిందని, ఆనాటి ఆదేశాలను ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇంకా కొనసాగించడం ఏమాత్రం సరికాదని ఏఐఓసీడీ స్పష్టం చేస్తోంది. తక్షణమే కోవిడ్ సమయంలో ఇచ్చిన ఆ ఆదేశాలను రద్దు చేసి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. ఈ నెల 20న జరిగే ఈ బంద్ ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన సెగ తగిలేలా దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మాసిస్ట్లు, ఔషధ విక్రయదారులు అందరూ ఏకతాటిపైకి వచ్చి సమ్మెలో పాల్గొననున్నారు.








