Mahaa Daily Exclusive

  చట్టం ముందు అందరూ సమానులే!”

Share

చట్టం ముందు అందరూ సమానులే!”
* కుమారుడి లొంగుబాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన.
* తప్పు చేయలేదని నా బిడ్డ పదేపదే చెబుతున్నాడు.
* న్యాయవ్యవస్థపై నాకు సంపూర్ణ నమ్మకం ఉంది.
* ఆధారాలు చూసి బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పడం వల్లే విచారణకు పంపడంలో కొంత జాప్యం.
హైదరాబాద్, మహా.
తన కుమారుడు బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన పరిణామాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. “సత్యమేవ జయతే” అంటూ తన అంతరంగాన్ని మీడియా ముఖంగా పంచుకున్నారు. చట్టంపై ఉన్న అపారమైన గౌరవంతోనే తన కుమారుడిని ఈరోజు న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణ నిమిత్తం అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశారు. చట్టం ముందు సామాన్యుడైనా, అధికారంలో ఉన్న నాయకుడి బిడ్డైనా సమానమేనని, దేశంలో ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి తీరాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. తన కుమారుడు భగీరథ్ ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని బండి సంజయ్ పేర్కొన్నారు.
వాస్తవానికి తన కుమారుడిపై ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని తాను దృఢంగా నిర్ణయించుకున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. అయితే, ఇదే సమయంలో న్యాయవాదులను సంప్రదించి తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను వారి ముందు ఉంచామని తెలిపారు. ఆ ఆధారాలను నిశితంగా పరిశీలించిన న్యాయవాదులు ఆరోపణలు నిలబడవని, కేసును కొట్టేస్తారని, తప్పకుండా బెయిల్ వస్తుందని భరోసా ఇచ్చారని, కేవలం ఆ న్యాయపరమైన సంప్రదింపుల కారణం చేతనే లొంగుబాటులో కొంత జాప్యం జరిగిందని ఆయన అసలు విషయాన్ని వివరించారు.
ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే పూర్తి నమ్మకంతో లాయర్లు ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. సోమవారం నాడు కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన నమ్మకం, అపారమైన గౌరవం ఉన్నందున ఇక ఏమాత్రం జాప్యం చేయడం సరికాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ సదుద్దేశంతోనే తన అబ్బాయిని స్వయంగా తీసుకొచ్చి లాయర్ల ద్వారా పోలీసులకు విచారణ కోసం అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశారు.