ఏఐఏడీఎంకే మద్దతు తీసుకుంటే ఊరుకోం.
* టీవీకే ప్రభుత్వానికి సీపీఐ(ఎం) తీవ్ర హెచ్చరిక.
* మంత్రివర్గంలోకి చేర్చుకుంటే మద్దతు ఉపసంహరణపై ఆలోచిస్తాం.
* అది ప్రజా తీర్పునకు విరుద్ధమన్న పి.షణ్ముగం.
చెన్నై,మహా.
తమిళనాట విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన ఆదిలోనే రాజకీయ సవాళ్లు మొదలయ్యాయి. ఒకవేళ ముఖ్యమంత్రి విజయ్ సర్కార్ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే మద్దతును స్వీకరించినా లేదా ఆ పార్టీని మంత్రివర్గంలోకి చేర్చుకున్నా.. తాము వెలుపల నుంచి ఇస్తున్న మద్దతును పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుందని సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం తిరువారూర్ జిల్లా తిరుతురైపూండిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటానికి, రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రాకూడదనే ఉద్దేశంతోనే తాము విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించామని షణ్ముగం స్పష్టం చేశారు. గవర్నర్ పాలన పేరుతో కేంద్రంలోని బీజేపీ దొడ్డిదారి గుండా ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకోకుండా నిరోధించడానికే వామపక్షాలు టీవీకేకు అండగా నిలిచాయన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తి హక్కు ఉందని ఆయన సమర్థించారు. అయితే, రాష్ట్రంలో డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా పరిపాలన అందిస్తామనే వాగ్దానంతోనే విజయ్ అధికారంలోకి వచ్చారని, అలాంటిది ఇప్పుడు ఏఐఏడీఎంకే మద్దతు తీసుకోవడం లేదా వారిని ప్రభుత్వంలో భాగం చేయడం ప్రజా తీర్పును, ప్రజల ఆశయాలను పూర్తిగా అవహేళన చేయడమే అవుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయదని ఆశిస్తున్నామని, ఒకవేళ లాలూచీ పడితే మాత్రం తాము మద్దతు ఉపసంహరణపై ఆలోచిస్తామని హెచ్చరించారు.
**కూటమి మార్పుపై వీసీకే సంకేతాలు.. మంత్రివర్గంలో చేరికకు ఆహ్వానం**
మరోవైపు తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం రసవత్తరంగా మారుతున్నాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు పరస్పరం చేతులు కలిపి టీవీకే సర్కార్ ఏర్పడకుండా అడ్డుకోవాలని చూశాయని తమిళనాడు ప్రజా పనులు, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి అధవ్ అర్జున ఆరోపించారు. ముఖ్యమంత్రి విజయ్ తన మంత్రివర్గాన్ని ఒకే కుటుంబంలా నడపాలని భావిస్తున్నారని చెప్తూ.. మంత్రివర్గంలో చేరాల్సిందిగా వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు ఆయన బహిరంగ ఆహ్వానం పలికారు. వామపక్షాలను కూడా ప్రభుత్వంలో చేర్చుకోవడానికి సీఎం ఆసక్తిగా ఉన్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
ఈ ఆహ్వానంపై వీసీకే అధ్యక్షుడు థోల్ తిరుమావలవన్ సానుకూలంగా స్పందించడం గమనార్హం. తాము ప్రస్తుతం డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ, టీవీకే ఇచ్చిన ఆహ్వానాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో చాలా మంది నాయకులు మంత్రివర్గంలో భాగస్వాములు కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, దీనిపై పార్టీ కార్యకర్తలతో పూర్తిస్థాయిలో చర్చించి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.








