జనగణన విధుల్లోని సిబ్బంది బదిలీలపై ప్రభుత్వం నిషేధం.
* తక్షణమే అమల్లోకి వచ్చిన ఆదేశాలు.
* గడువుల వారీగా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు.
అమరావతి, మహా .
రాబోయే ‘జనగణన-2027’ (ఇళ్ల లెక్కింపు, గృహ జనగణన) ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనగణన విధుల్లో నియమితులైన వివిధ కేటగిరీల అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రక్రియ ముగిసేవరకు బదిలీ చేయకుండా కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ అతిపెద్ద జాతీయ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, నిరంతరాయంగా పనులు సాగేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ బదిలీల నిషేధ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లు మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యుమరేటర్ల వరకు అన్ని విభాగాల సిబ్బందికి వర్తిస్తాయి. విధుల్లోని ప్రాధాన్యతను బట్టి వేర్వేరు గడువులను నిర్దేశించారు. దీని ప్రకారం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు వంటి ప్రధాన జనగణన అధికారులకు ఈ ఏడాది జూన్ 30 వరకు బదిలీలపై పూర్తి స్థాయిలో నిషేధం ఉంటుంది. అలాగే మండల రెవెన్యూ కార్యాలయాల్లో కీలకమైన సాంకేతిక సేవలు అందించే టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లకు జూన్ 10 వరకు బదిలీలు ఉండవు.
మరోవైపు క్షేత్రస్థాయిలో నేరుగా గృహాల సర్వే నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు జూన్ 7 వరకు బదిలీలపై ఆంక్షలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన ఈ జాతీయ విధి నిర్వహణలో సిబ్బంది కొరత లేదా మార్పుల వల్ల ఎలాంటి జాప్యం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ గడువులను ఖరారు చేశారు. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ఉన్నతాధికారులు కచ్చితంగా అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనలకు తావుండకూడదని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.








