Mahaa Daily Exclusive

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భట్టి భేటీ…

Share

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భట్టి భేటీ.
* రాష్ట్ర అభివృద్ధికి రూ.5,000 కోట్ల ప్రత్యేక సాయం మంజూరు చేయాలని విజ్ఞప్తి.
* విద్యా ప్రాజెక్టులకు ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయింపు కోరిన డిప్యూటీ సీఎం.
ఢిల్లీ,మహా.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతుల కల్పన, మూలధన వ్యయాలకు సంబంధించిన పలు ప్రాధాన్యతా అంశాలపై కేంద్ర మంత్రితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర పురోగతికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
ముఖ్యంగా మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం అందించే పథకం ‘సాస్కీ’ కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాల తీరును నిర్మలా సీతారామన్‌కు భట్టి విక్రమార్క సవివరంగా వివరించారు.
వీటితో పాటు రాష్ట్రంలో విద్యా రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరహా విద్యా రంగ ప్రాజెక్టుల కోసం ఆర్థిక వ్యవహారాల శాఖ ఇప్పటికే ఆమోదించిన విదేశీ ద్రవ్య సహకార ప్రాజెక్టులకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి ప్రత్యేక మినహాయింపు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.