ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.
*డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
* వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకార సేవలో’ నిధుల విడుదల.
* భృతి రూ.20 వేలకు పెంపు.. తీరప్రాంతాల్లో వలసల నివారణే లక్ష్యం.
కాకినాడ, మహా.
రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనప్పటికీ మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను గమనంలో ఉంచుకుని, వరుసగా రెండో ఏడాది కూడా ‘మత్స్యకార సేవలో’ పథకం కింద ఆర్థిక భృతిని విడుదల చేసినట్లు ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం కేవలం పది వేల రూపాయలు మాత్రమే ఇవ్వగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతతో ఆ మొత్తాన్ని ఏకంగా రెట్టింపు చేసి, ఇరవై వేల రూపాయలకు పెంచి అందిస్తోందని వెల్లడించారు. ఈ నిధులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తూ సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల చెంతకు చేరుస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుండగా, ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయలను వ్యయం చేస్తోందని వివరించారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో 24,930 మంది లబ్ధిదారులకు 49.86 కోట్ల రూపాయల మేర, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మందికి 13.79 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరనుందని గణాంకాలతో సహా వెల్లడించారు.
తీర ప్రాంతాల్లో మత్స్యకారుల వలసలను పూర్తిగా నివారించి, స్థానికంగానే వారికి మెరుగైన స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం వెంబడి ఉన్న 51 మత్స్యకార గ్రామాల అభివృద్ధికి, 23 ల్యాండింగ్ సెంటర్ల పరిధిలోని ప్రజల ఆసరా కోసం అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 4,578 బోట్లకు దాదాపు 91.48 లక్షల లీటర్ల డీజిల్పై 8.23 కోట్ల రూపాయల సబ్సిడీని అందించినట్లు వివరించారు.
అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డీఆర్డీఏ సహకారంతో ఇంజన్లు, వలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 1.13 కోట్ల రూపాయల రాయితీ కల్పించామని, కోనపాపపేట గ్రామంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో మత్స్యకారుల కోసం అధునాతన కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం వంద శాతం సబ్సిడీతో ఉచితంగా ట్రాన్స్పాండర్లను అందజేస్తున్నామని, ఇవి తుపానులు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రాణరక్షణకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సముద్రంలో జీవవైవిధ్యాన్ని, చేపల సంపదను పెంచేందుకు జిల్లాలో 20 ప్రాంతాలను ఎంపిక చేసి ఒక్కో చోట 20 లక్షల వ్యయంతో కృత్రిమ రీఫ్లను (ఆర్టిఫిషియల్ రీప్స్) ఏర్పాటు చేస్తున్నామని, సముద్ర తాబేళ్లను రక్షించేందుకు అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా టెడ్ పరికరాలను పంపిణీ చేస్తున్నామని పవన్ కల్యాణ్ వివరించారు.








