Mahaa Daily Exclusive

  చివరి శ్వాస వరకు బీజేపీతోనే…..

Share

చివరి శ్వాస వరకు బీజేపీతోనే..
* నా దేహంపై ఆ జెండానే కప్పాలి.
* బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.
* కేటీఆర్‌ నడుపుతున్నది ఫేక్ మీడియా ఫ్యాక్టరీ.
* కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదు.
* కన్న కొడుకునే పోలీసులకు అప్పగించిన నైతిక చరిత్ర నాది.
* గడీల పాలన కూల్చిన అక్కసుతోనే కుట్రలు.
హైదరాబాద్, మహా.

తన చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని, ప్రాణం విడిచాక తన భౌతికకాయంపై బీజేపీ జెండానే కప్పాలన్నది తన ఆఖరి కోరిక అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. తాను కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన రక్తంలోనే బీజేపీ పట్ల అపారమైన ప్రేమ ఉందని, కొత్త పార్టీలు పెట్టే చిల్లర మల్లర రాజకీయాలు చేసే ఆలోచన తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇటీవల తన కుమారుడి వివాదం తర్వాత తొలిసారిగా నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన వ్యక్తిత్వం, నైతికత, నిజాయితీ ఏంటో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసని స్పష్టం చేసిన ఆయన, సోషల్ మీడియా వేదికగా తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలను కుండబద్దలు కొట్టినట్లు ఖండించారు.
తన రక్తంలోనే బీజేపీ సిద్ధాంతాల పట్ల అపారమైన ప్రేమ ఉందని, చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని బండి సంజయ్ స్పష్టం చేశారు. తనపై, పార్టీపై జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి ప్రధాన సూత్రధారి కేటీఆరే అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ఒక ‘ఫేక్ మీడియా ఫ్యాక్టరీ’ నడుపుతున్నారని, పనిగట్టుకుని తనను డ్యామేజ్ చేసేందుకు పెయిడ్ బ్యాచ్‌తో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయాల్లో నాయకులు తమ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే అధికార బలంతో వెనకేసుకురావడం చూస్తుంటామని, కానీ ఈ విషయంలో తన చరిత్ర పూర్తిగా విభిన్నమని బండి సంజయ్ గుర్తుచేశారు. తన కుమారుడికి సంబంధించిన ఒక వివాదం గురించి సమాచారం వచ్చిన వెంటనే, ఒక తండ్రిగా తన అధికారాన్ని ఉపయోగించి కాపాడే ప్రయత్నం చేయలేదని, కన్న కొడుకును స్వయంగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన ఏకైక నైతిక చరిత్ర కలిగిన నాయకుడిని తానేనని ఉద్ఘాటించారు. అందుకే రాజకీయాల్లో విలువలు, నైతికత గురించి మాట్లాడే పూర్తి అర్హత తనకు మాత్రమే ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల అహంకారపూరిత కుటుంబ, గడీల పాలనకు చరమగీతం పాడింది బీజేపీయేనని, వారి కోటల గోడలను బద్దలు కొట్టింది తామేనని గుర్తు చేశారు. ఆ ఫ్రస్టేషన్, అక్కసుతోనే ఇప్పుడు తనపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని, ఇక తన అరెస్టు ప్రచారాల గురించి కోర్టులోనే అన్నీ తేలుతాయని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, కుమారుడి వివాదం అనంతరం తొలిసారి పార్టీ కార్యాలయానికి విచ్చేసిన బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. కేంద్ర మంత్రికి సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. “సంజయ్ మా నాయకుడు.. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది” అంటూ అభిమానులు చేసిన పెద్దపెట్టున నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. “జై బండి సంజయ్” నినాదాలతో రాష్ట్ర కార్యాలయం దద్దరిల్లింది.