Mahaa Daily Exclusive

  దేశం ఆర్థికంగా చితికిపోతుంటే….

Share

  • దేశం ఆర్థికంగా చితికిపోతుంటే
  • మోదీ ఇటలీలో చాక్లెట్లు పంచుతున్నారు
  • ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శ

మహా : ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి ‘మెలోడీ’ చాక్లెట్లు బహుకరించడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ప్రధాని విదేశాల్లో ‘రీల్స్’ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో జరిగిన ‘బహుజన్ స్వాభిమాన్ సభ’లో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రధాని వైఖరిపై ధ్వజమెత్తారు. దేశంలో సామాన్యుడు ధరల భారంతో విలవిల్లాడుతుంటే, ప్రధాని మాత్రం విదేశాల్లో చాక్లెట్లు పంపిణీ చేస్తూ హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

‘మెలోడీ’ గిఫ్ట్.. రాహుల్ సెటైర్

ఇటలీ ప్రధాని మెలోని ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో ప్రధాని మోదీ తమకు ‘మెలోడీ’ చాక్లెట్లను బహుమతిగా ఇచ్చారని ఆమె సరదాగా పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, దీనిని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. “దేశంలో ఆర్థిక తుపాను చెలరేగుతోంది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు కన్నీరు పెడుతున్నారు. కానీ ప్రధాని మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారు. బీజేపీ నాయకులు చప్పట్లు కొడుతున్నారు. ఇది నాయకత్వం కాదు, ఒక ప్రహసనం” అని రాహుల్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు. దేశం త్వరలో భారీ ఆర్థిక గండం ఎదుర్కోబోతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్లను ఆపాలని, విదేశీ ప్రయాణాలు చేయవద్దని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేయడంపై రాహుల్ స్పందించారు. ప్రజలను విదేశాలకు వెళ్లొద్దని చెప్పిన ప్రధాని, మరుసటి రోజే ఐదు దేశాల పర్యటనకు వెళ్లారు. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరగబోతోందనడానికి ప్రధాని మాటలే నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని చిన్న వ్యాపారులు, సామాన్యులు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.