- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను సకాలంలో సేకరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమిల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల తీరు, రవాణా ఇబ్బందులపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత సీజన్లో కొన్నిచోట్ల ఎదురవుతున్న రవాణా సమస్యలను అధిగమించడానికి, మిల్లులకు ధాన్యాన్ని వేగంగా తరలించడానికి వీలుగా ప్రత్యామ్నాయంగా ఇసుక, సిమెంట్ రవాణా చేసే లారీలను కూడా తక్షణమే వాడుకోవాలని అధికారులకు సూచించారు. దీనివల్ల లారీల కొరత తీరి, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వేగంగా క్లియరెన్స్ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణవ్యాప్తంగా రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికే సుమారు 51 లక్షల టన్నుల ధాన్యపు దిగుబడులను విజయవంతంగా సేకరించి, రైతులకు సంబంధించిన డబ్బులను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశామని పేర్కొన్నారు. వరి రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ ఒక్క ఏడాదిలోనే రైతులకు ఏకంగా రూ. 45,000 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించడమే నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇదే సమయంలో రైతులను ఇబ్బంది పెట్టే అంశాలపై మంత్రి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గానీ, మిల్లుల వద్ద గానీ ‘తరుగు’ పేరుతో అన్నదాతలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. తరుగు నెపంతో రైతుల శ్రమను దోచుకునేలా వ్యవహరించే ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, రైతులకు తూకంలో ఎలాంటి అన్యాయం జరగకుండా పక్కాగా నిబంధనలు అమలు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.







