Mahaa Daily Exclusive

  అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు ఊరట.

Share

  •  నెల రోజుల్లోగా తెరుచుకోనున్న ‘హోర్ముజ్ జలసంధి.

    వాషింగ్టన్,మహా.

    గత కొన్ని నెలలుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు ఎట్టకేలకు ఊపిరినిచ్చే వార్త అందింది. ప్రపంచ దేశాల ఇంధన అవసరాలకు అత్యంత కీలకమైన, వ్యూహాత్మక ‘హోర్ముజ్ జలసంధి’ గుండా నౌకల రాకపోకలు రాబోయే 30 రోజుల్లోగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు ముందు ఈ మార్గంలో ఏ స్థాయిలో అంతర్జాతీయ వాణిజ్య రవాణా సాగిందో.. నెల రోజుల్లో మళ్లీ అదే మునుపటి వైభవాన్ని తీసుకురావడానికి ముమ్మర చర్చలు జరుగుతున్నట్లు ఇరాన్ వెల్లడించింది.

    అమెరికా – ఇరాన్ ఒప్పందం దాదాపు ఖరారు: హింట్ ఇచ్చిన ట్రంప్.

    మరోవైపు ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలను తొలగించి, ఉద్రిక్తతలను తగ్గించేలా అమెరికా – ఇరాన్ సహా పలు దేశాల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ శాంతి ఒప్పందంలో భాగం గానే హోర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణాకు పూర్తిగా తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ శాంతి చర్చల పురోగతిపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తాము ఇరాన్ అగ్రనేతలతో జరిపిన రాయబార చర్చలు సఫలమయ్యాయని, అమెరికా – ఇరాన్ మధ్య తదుపరి ఉన్నత స్థాయి చర్చలు త్వరలోనే జరగబోతున్నాయని పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వెల్లడించారు. అమెరికా – ఇరాన్‌ల మధ్య చోటుచేసుకున్న ఈ సానుకూల పురోగతిని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సాదరంగా స్వాగతించారు. దీర్ఘకాలిక యుద్ధానికి ముగింపు పలికి, హోర్ముజ్ మార్గాన్ని సురక్షితం చేసే ఈ శాశ్వత ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

    భారతదేశానికి భారీ ఊరట.. తగ్గనున్న దిగుమతి భారం

    హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ నిర్ణయం భారతదేశానికి వ్యూహాత్మకంగా మరియు ఆర్థికంగా అతిపెద్ద సానుకూల అంశంగా అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన ముడి చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సింహభాగం ఈ హోర్ముజ్ జలసంధి మార్గం గుండానే దేశానికి వస్తుంది. మధ్యప్రాచ్య యుద్ధ భయంతో ఇప్పటివరకు అంతర్జాతీయ నౌకలు ఆఫ్రికా ఖండం మీదుగా సుదీర్ఘ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం వల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరిగాయి. ఈ మార్గం మళ్లీ సురక్షితంగా మారితే నౌకల ప్రయాణ దూరంతో పాటు భారతదేశ ముడి చమురు దిగుమతుల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుందని, ఇంధన ధరలు స్థిరపడటంతో పాటు గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు భారీ ఊపు లభిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.