Mahaa Daily Exclusive

  రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.

Share

  •  ధాన్య సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష.

హైదరాబాద్, మహా.

రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పౌర సరఫరాలు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి నల్లాన్ ఇంద్రసేనారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణలో సాగుతున్న ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు, జిల్లా కలెక్టర్లు మరియు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని, రైతులకు మద్దతు ధర చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరగకూడదని మంత్రి దిశానిర్దేశం చేశారు.

తరుగు పేరుతో కోతలు విధిస్తే సహించేది లేదు

కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు లేదా తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతూ ధరల్లో కోతలు విధిస్తే మిల్లుల యజమానులు, కొనుగోలు సిబ్బందిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రైతాంగానికి నష్టం కలిగించే ఎలాంటి చర్యలనైనా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా (తూకం) కోసం వేచి ఉన్న సుమారు 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఏరోజుకారోజు మిల్లులకు తరలించేలా రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అస్సలు ఆందోళన చెందవద్దని, ప్రకృతి వైపరీత్యాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఒకవేళ తడిసిన ధాన్య సేకరణకు నిరాకరిస్తే సంబంధిత మిల్లర్లపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

గణాంకాలతో విపక్షాల విమర్శలకు సమాధానం

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల్లో గందరగోళం సృష్టించవద్దని మంత్రి హితవు పలికారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లను కలుపుకొని రైతులకు ఇప్పటివరకు ఏకంగా రూ.45,000 కోట్ల మేర రికార్డు స్థాయిలో చెల్లింపులు చేసిందని ఆయన వెల్లడించారు. రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా చరిత్రలోనే అత్యధికంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటివరకు ఈ కేంద్రాల ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా సేకరించామని గణాంకాలతో సహా స్పష్టం చేశారు. ఈ రబీ సీజన్‌లో మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.8,749 కోట్ల నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలిపారు.

గన్నీ బ్యాగుల కొరత లేదు.. అంతా అవాస్తవం

రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, క్షేత్రస్థాయిలో ఇప్పటికే 21 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వేసవి తీవ్రత కారణంగా హమాలీల కొరత ఏర్పడటం వల్ల రవాణాలో స్వల్ప జాప్యం జరిగిందని, ఆ సమస్యను కూడా అధిగమించామని చెప్పారు. ప్రస్తుత రబీ సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి రాగా.. కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకే పరిమితమైందని, మిగిలిన ధాన్యం మొత్తాన్ని రైతుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేస్తోందని వివరించారు.

ఈ సమీక్షలో కొనుగోలు కేంద్రాల పనితీరు, ధాన్యం రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాలు, గోదాముల నిల్వ సామర్థ్యంపై జిల్లా వారీగా మంత్రులు ఆరా తీశారు. అలాగే కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం, మహిళా సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ లక్ష్యాలను నెరవేర్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.