• యాంటీ ఇండియా గ్యాంగ్ గుర్తింపు అవసరం లేదు.
• కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు.
ఢిల్లీ, మహా.
సోషల్ మీడియాను షేక్ చేస్తూ, దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిజిటల్ మూవ్‌మెంట్‌పై కేంద్ర న్యాయ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అత్యంత ఘాటుగా స్పందించారు. సామాజిక మాధ్యమాల వేదికగా అనూహ్య ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ ప్లాట్‌ఫామ్‌కు పొరుగు దేశమైన పాకిస్థాన్, అంతర్జాతీయ బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌ల నుంచి తెరవెనుక మద్దతు లభిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు.
యాంటీ ఇండియా గ్యాంగ్ గుర్తింపు అవసరం లేదు
ఎక్కడా సదరు డిజిటల్ సంస్థ పేరును నేరుగా ప్రస్తావించకుండానే విమర్శనాస్త్రాలు సంధించిన కిరణ్ రిజిజు.. “సోషల్ మీడియాలో పాకిస్థాన్, జార్జ్ సోరోస్ గ్యాంగ్ నుంచి ఫాలోవర్లను సంపాదించుకోవాలని చూసేవారిని చూస్తుంటే నాకు జాలేస్తోంది. భారతదేశంలో అమితమైన శక్తి సామర్థ్యాలు కలిగిన యువత కోట్లాది మంది ఉన్నారు. దేశాభివృద్ధికి ఉపయోగపడేలా, నిజాయితీతో కూడిన విలువైన ఫాలోవర్లుగా మారే సత్తా మన దేశ యువతకు ఉంది. అంతే తప్ప, మన ఉనికి కోసం దేశ వ్యతిరేక శక్తుల (యాంటీ ఇండియా గ్యాంగ్) నుంచి ఎలాంటి గుర్తింపును లేదా మద్దతును కోరాల్సిన అవసరం భారతీయులకు లేదు” అని రిజిజు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి సుకాంత మజుందార్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ.. ఈ సాటిలైట్ పొలిటికల్ పేజీకి ఉన్న ఫాలోవర్లలో దాదాపు 49 శాతం మంది పాకిస్థాన్‌కు చెందినవారేనని, కేవలం 9 శాతం మాత్రమే భారతీయులు ఉన్నారంటూ ఐటి నివేదికలను ఉటంకించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు సరిహద్దుల అవతల నుంచి జరుగుతున్న ఒక పెద్ద ‘ఇన్‌ఫ్లుయెన్స్ ఆపరేషన్’ (ప్రభావ కుట్ర) లో భాగమే ఇదంతా అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మా ఫాలోవర్లలో 94 శాతం భారతీయులే: వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కౌంటర్
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సోషల్ మీడియా క్యాంపెయిన్ వర్కర్ అభిజీత్ దీప్కే తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. తమ అకౌంట్ హ్యాక్ కావడానికి ముందు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఆడియన్స్ డెమోగ్రాఫిక్స్ (ఫాలోవర్ల వివరాలు) కు సంబంధించిన ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియోను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. “మా అధికారిక డేటా ప్రకారం.. కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్న వారిలో 94.1 శాతం మంది ముమ్మాటికీ భారతదేశానికి చెందినవారే. కేవలం 1 శాతం అమెరికా, 0.7 శాతం బ్రిటన్ వాసులు ఉన్నారు. దేశ సమస్యలపై గళమెత్తుతున్న భారతీయ యువతను ఒక కేంద్ర మంత్రి ఏకంగా ‘పాకిస్థానీలు’ అని ఎలా ముద్రవేస్తారు?” అని అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ తాము దాదాపు 6 లక్షల మందితో ఆన్‌లైన్ పిటిషన్ సంతకాలు సేకరించినందుకే.. తట్టుకోలేక ప్రభుత్వం తమ వెబ్‌సైట్‌ను, ఇన్‌స్టాగ్రామ్ పేజీని అక్రమంగా బ్లాక్ చేయించిందని ఆయన ఆరోపించారు.
అసలు ఏమిటీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వివాదం?
ఇటీవల సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ల హోదాకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా.. కొంతమంది అర్హత లేని వ్యక్తులను ఉద్దేశించి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ‘కాక్రోచెస్’, ‘పారాసైట్స్’ (పరాన్నజీవులు) అనే పదాలు వాడారంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడిచింది (అయితే తాను నకిలీ డిగ్రీలతో వ్యవస్థలోకి వచ్చేవారిని ఉద్దేశించే ఆ మాట అన్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని సీజేఐ తర్వాత స్పష్టం చేశారు). ఈ వివాదాన్ని అందిపుచ్చుకున్న అభిజీత్ దీప్కే.. నిరుద్యోగం, పరీక్షల ఒత్తిడి, నియామకాల్లో అవకతవకలపై పోరాడే యువత గళంగా మారుస్తూ వ్యంగ్యాత్మకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ని డిజిటల్ వేదికపై స్థాపించారు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లాది వ్యూస్, మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని ప్రధాన పార్టీల పేజీలను సైతం దాటేసింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం సహా పలువురు విపక్ష నేతలు (మహువా మోయిత్రా, పినరయి విజయన్ తదితరులు) ఈ కాక్రోచ్ మూవ్‌మెంట్‌కు మద్దతు తెలపడంతో.. ప్రస్తుతమిది దేశవ్యాప్తంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఐటీ వార్‌గా రూపాంతరం చెందింది.







