Mahaa Daily Exclusive

  కబ్జాకోరులపై ‘హైడ్రా’ పంజా…

Share

కబ్జాకోరులపై ‘హైడ్రా’ పంజా.
* రూ.4,117 కోట్ల భూములకు విముక్తి.
* కోకాపేట, ఖానామెట్, భరత్‌నగర్‌లో రికార్డు స్థాయిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.
* గోల్డ్‌ఫిష్ విల్లాల ఆటస్థలాలు నేలమట్టం.
* చెరువులను మింగేస్తున్న రియల్టర్లకు షాక్.
హైదరాబాద్, మహా.
మహానగరంలో కబ్జారాయుళ్లకు, అక్రమ నిర్మాణదారులకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) సింహస్వప్నంగా మారింది. మంగళవారం ఐటీ కారిడార్ పరిధిలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో కోకాపేట, ఖానామెట్, భరత్‌నగర్ పరిసరాల్లోని అత్యంత విలువైన ప్రభుత్వ, చెరువు భూములను ఆక్రమణదారుల చెర నుంచి అధికారులు విడిపించారు. పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఈ ఆపరేషన్ ద్వారా ఒక్కరోజే ఏకంగా రూ.4,117 కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించి, వాటి చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేశారు. మార్కెట్లో ఎకరా భూమి ధర సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.177 కోట్ల వరకు పలుకుతున్న అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బడా రియల్టర్లు సాగిస్తున్న ఆగడాలకు అధికారులు గట్టి బ్రేక్ వేశారు.
**గోల్డ్‌ఫిష్ విల్లాల ఆటస్థలాలు నేలమట్టం**
అత్యంత విలాసవంతమైన కోకాపేట ప్రాంతంలో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు చేసిన అక్రమాలను ఈ ఆపరేషన్ బట్టబయలు చేసింది. కోకాపేటలోని కొత్తచెరువును లక్ష్యంగా చేసుకుని గోల్డ్‌ఫిష్ కాలనీ పేరుతో వెలిసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ.. చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిలోని 1.09 ఎకరాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించింది. అక్కడ విల్లాలను నిర్మించడమే కాకుండా.. మిగిలిన చెరువు భాగాన్ని మట్టితో పూడ్చివేసి, విల్లా నివాసితుల కోసం లగ్జరీ గార్డెన్లు, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు, పిల్లల ఆట స్థలాలను సర్వాంగ సుందరంగా నిర్మించింది. దీనిపై ప్రజావాణిలో స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దస్త్రాలను పరిశీలించిన హైడ్రా.. ఆ ప్రాంతం పూర్తిగా ఎఫ్‌టీఎల్ పరిధి అని తేల్చింది. వెంటనే రంగంలోకి దిగి ఆ అక్రమ నిర్మాణాలను, గోడలను పూర్తిగా తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే, కోకాపేట పెద్దచెరువు పరిధిలో వివిధ బహుళ అంతస్తుల సంస్థలు ఆక్రమించిన దాదాపు 22 ఎకరాల స్థలాన్ని కూడా కాపాడింది. ఈ ఒక్క ప్రాంతంలోనే కాపాడిన భూమి విలువ రూ.3 వేల కోట్లకు పైమాటేనని అధికారులు వెల్లడించారు.
**మ్యాప్ నుంచే చెరువు మాయం కుట్ర భగ్నం**
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలో ఉన్న ఈదులకుంట చెరువును ఏకంగా మ్యాప్ నుంచే మాయం చేసేందుకు జరిగిన కుట్రను కూడా హైడ్రా అధికారులు తీవ్రంగా పరిగణించి అడ్డుకున్నారు. శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట చెరువు నిండిన తర్వాత వరద నీరు కాలువ ద్వారా ఈదులకుంటకు చేరుతుంది. అయితే, కబ్జాదారులు పక్కా స్కెచ్‌తో ఆ వరద కాలువను వేరే వైపు మళ్లించి చెరువు పూర్తిగా ఎండిపోయేలా చేశారు. ఆ తర్వాత స్కైస్క్రాపర్స్ నిర్మాణానికి భూమిని సిద్ధం చేశారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో సైతం కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన హైడ్రా అధికారులు, పాత ఎఫ్‌టీఎల్ సరిహద్దులను గుర్తించి రూ.600 కోట్ల మార్కెట్ విలువ గల 6.50 ఎకరాల చెరువు స్థలాన్ని కాపాడి కంచె వేశారు. దీనికి ఆనుకునే ఉన్న సర్వే నంబర్ 11/37లోని రూ.500 కోట్ల విలువైన మరో 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం కబ్జారాయుళ్లు సర్వే నంబర్లు మార్చి దక్కించుకోవాలని చూడగా.. ఆ భూమిని కూడా హైడ్రా తన ఆధీనంలోకి తీసుకుంది.
**పరిహారం పొంది.. కబ్జా వదలకుండా..**
రహదారి విస్తరణ కోసం ప్రభుత్వ పరిహారం పొందినప్పటికీ స్థలాన్ని వదలని ఓ భూయజమానికి అధికారులు గట్టి బుద్ధిచెప్పారు. భరత్‌నగర్ – ఖైతలాపూర్ – హఫీజ్‌పేట్ రహదారి విస్తరణ పరిధిలో రెయిన్‌బో విస్టా మీదుగా రైల్వేట్రాక్ వరకు 100 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ గతంలో భూసేకరణ చేపట్టింది. భూయజమానికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించినప్పటికీ.. రోడ్డుకు ఇవ్వాల్సిన 1700 గజాల స్థలాన్ని తన కబ్జాలోనే ఉంచుకుని అక్కడ కార్యాలయం, గోశాలను నిర్మించాడు. దీనివల్ల ఆ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న హైడ్రా బలగాలు.. జ్యుయెల్ హైట్ గేటెడ్ కమ్యూనిటీ ముందున్న ఆ అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశాయి. సుమారు రూ.17 కోట్ల విలువైన ఈ స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం అప్పగించి, ప్రజా రవాణాకు మార్గాన్ని సుగమం చేశాయి.