Mahaa Daily Exclusive

  ఆర్టీసీ డ్రైవర్‌ను తొలగించొద్దు….

Share

ఆర్టీసీ డ్రైవర్‌ను తొలగించొద్దు.
* రైతుల పక్షాన మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నాం.
*బస్సు యాజమాన్యానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచన.
*కాంగ్రెస్ నేతల నిరసనపై డ్రైవర్ అశోక్ వ్యాఖ్యలతో రేగిన వివాదం.
* బీఆర్ఎస్, విపక్షాల తీవ్ర విమర్శలతో వెనక్కి తగ్గిన అధికార యంత్రాంగం.
జగిత్యాల,మహా.
ధాన్యం కొనుగోలు, రైతుల సమస్యలపై గళమెత్తిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ అశోక్‌ను విధుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. అధికార కాంగ్రెస్ నేతల నిరసనపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ వివాదానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎట్టకేలకు తెరదించారు. డ్రైవర్ అశోక్‌ను తక్షణమే విధుల్లో కొనసాగించాలని, అతడిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బస్సు యాజమాన్యానికి మంగళవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే.. సోమవారం జగిత్యాల నుంచి ధర్మపురికి ఆర్టీసీ అద్దె బస్సు వెళ్తున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంపై బస్సు డ్రైవర్ అశోక్ స్పందిస్తూ.. పెట్రోల్ ధరలపై నిరసనలు చేయడం కన్నా, ముందుగా రైతులు పండించిన మొక్కజొన్న, పత్తి వంటి పంటల కొనుగోళ్లపై దృష్టి సారించాలని హితవు పలికారు. రైతుల పక్షాన ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. సదరు డ్రైవర్ కాంగ్రెస్ పార్టీ నిరసనను కించపరిచేలా మాట్లాడారంటూ ఒక స్థానిక నేత ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ తక్షణమే స్పందించారు. డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆదేశిస్తూ బస్సు యజమానికి అధికారికంగా లేఖ రాశారు.
దీనిపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సహా ఇతర విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ప్రజా సమస్యలను, వ్యవసాయ రంగ ఇబ్బందులను ప్రశ్నించిన వారి ఉద్యోగాలు తీసేయడం ముమ్మాటికీ అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి తదితరులు నేరుగా కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌ను కలిసి, అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. సామాన్య ఉద్యోగిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. డ్రైవర్ అశోక్ ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగి కాదని, కేవలం అద్దె బస్సు డ్రైవర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఒక సామాన్యుడిగా రైతుల పక్షాన నిలబడి ఆయన మాట్లాడిన తీరును తాము స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అందుకే అతడిని ఉద్యోగం నుంచి తొలగించవద్దని బస్సు యజమానికి సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణపై విపక్షాలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ సున్నితమైన రైతాంగ సమస్యను విపక్షాలు రాజకీయ కోణంలో వక్రీకరించవద్దని ఆయన హితవు పలికారు.