Mahaa Daily Exclusive

  చంద్రబాబును ఢీకొడదాం….

Share

చంద్రబాబును ఢీకొడదాం.
* ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరేద్దాం.
* ఏకగ్రీవమైతే ఇన్‌ఛార్జిల వైఫల్యమే.
* జగన్ తీవ్ర హెచ్చరిక.
* ఎస్సీలు బలంగా ఉన్నచోట వారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు.
*ప్రభుత్వ వైఫల్యాలపై ‘వెన్నుపోటు రెండేళ్లు’ బుక్‌లెట్‌తో ఇంటింటా ప్రచారం.
* తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం.
అమరావతి, మహా
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాయత్తం చేశారు. అధికార కూటమి కుట్రలను, చంద్రబాబు నాయుడు వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొని, క్షేత్రస్థాయిలో పార్టీని విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా ఆయన బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు అత్యంత కీలకమైన, ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా, ఏ ఒక్క స్థానంలోనైనా ప్రత్యర్థి పార్టీ ఏకగ్రీవంగా గెలిచిందనే వార్త వస్తే.. దానిని పూర్తిగా సదరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఫల్యంగానే పరిగణిస్తానని ఆయన తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలను ఒప్పుకునే ప్రసక్తే లేదని, ప్రతి స్థానంలోనూ గట్టి పోటీ ఇచ్చి వైఎస్సార్సీపీ జెండాను ఎగరేయాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు.
**అభ్యర్థులకు అండగా నిలవాలి**
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, వారికి కల్పించాల్సిన భరోసాపై వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు బలంగా ఉన్న గ్రామాల్లో, ఆ వర్గానికి చెందిన అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దింపాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీతో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పూర్తి అండదండలు అందిస్తున్నారనే నమ్మకాన్ని, ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందన్నారు. స్థానిక పోరులో మనం అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిస్తేనే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారు పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించి మనకు అండగా నిలుస్తారని ఆయన వివరించారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న వారినే గుర్తించి ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
**’వెన్నుపోటు రెండేళ్లు’ పేరుతో ఇంటింటా చర్చ**
ప్రస్తుత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునేందుకు ‘వెన్నుపోటు రెండేళ్లు’ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన బుక్‌లెట్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వ లోపాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి ఇంటా చర్చ జరిగేలా చూడాలని, ఆ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తే వారే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా, పకడ్బందీగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా భయపడకుండా ధైర్యంగా నిలబడి స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.