Mahaa Daily Exclusive

  ఎవరెస్ట్ శిఖరంపై హైదరాబాదీ మృతి.,,

Share

ఎవరెస్ట్ శిఖరంపై హైదరాబాదీ మృతి.
* హిమవంతుడి ఒడిలోనే శాశ్వత ‘విశ్రాంతి’.
*మృతదేహాన్ని పర్వతంపైనే వదిలేయాలని కుటుంబ సభ్యుల నిర్ణయం.
*డెత్ జోన్‌లో రెస్క్యూ అత్యంత ప్రమాదకరం.
* రూ.90 లక్షల భారీ ఖర్చు.
*హిమాలయాలను ‘దేవభూమి’గా భావించి వీడిన బంధాలు.. తివారీ మరణంపై విషాదం.
హైదరాబాద్,మహా.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనేది ఆ పర్వతారోహకుడి కల. గత ఏడాది చేసిన ప్రయత్నం అర్ధాంతరంగా ఆగిపోయినా, ఈసారి ఎలాగైనా సరే ఆ జెండాను ఎగురవేయాలనే పట్టుదలతో మళ్లీ అడుగులు వేశాడు. అనుకున్నట్లుగానే 8,848.86 మీటర్ల ఎత్తున ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా ముద్దాడాడు. కానీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. శిఖరాన్ని అధిరోహించి కిందకు దిగుతున్న క్రమంలో కొంతదూరం రాగానే తీవ్ర అనారోగ్యానికి గురై హిమవంతుడి ఒడిలోనే శాశ్వతంగా కన్నుమూశాడు. అత్యంత ఎత్తయిన ‘డెత్ జోన్’ (మృత్యు వలయం) పరిధిలో మరణించడంతో, ఆ మృతదేహాన్ని కిందకు తీసుకురావడం ఇతరుల ప్రాణాలకే ముప్పుగా మారడంతో.. ఆ పార్థివ దేహాన్ని ఎవరెస్ట్ శిఖరంపైనే వదిలేయాలని కుటుంబ సభ్యులు అత్యంత భారమైన నిర్ణయం తీసుకున్నారు.
**కల నెరవేరిన వేళ.. కబళించిన మృత్యువు**
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ ప్రొఫెషనల్ అరుణ్ కుమార్ తివారీ (53) గత వారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ‘బూట్స్ అండ్ క్రాంపాన్స్’ సంస్థ ద్వారా శిక్షణ పొందిన ఆయన, ఈ సీజన్‌లో భారత పర్వతారోహకుల బృందంతో కలిసి నేపాల్ వెళ్లారు. మే 21వ తేదీ సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. అయితే, శిఖరాగ్రం నుంచి కేవలం 60 మీటర్ల కిందకు దిగుతుండగా.. దాదాపు 8,790 మీటర్ల ఎత్తున ఉన్న ‘హిల్లరీ స్టెప్’ వద్ద తివారీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఆయన శరీరం వేగంగా క్షీణించి, రక్తపు వాంతులు చేసుకున్నారు. ఆయనకు తోడుగా ఉన్న షెర్పా గైడ్లు అదనపు ఆక్సిజన్ అందిస్తూ బతికించడానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అరుణ్ కుమార్ తివారీ అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు.
**తీసుకురావాలంటే రూ.90 లక్షల ఖర్చు.. ప్రాణాలకే రిస్క్**
అరుణ్ కుమార్ తివారీ మరణించిన ప్రాంతం ఎవరెస్ట్ పర్వతంపై అత్యంత ప్రమాదకరమైన ‘డెత్ జోన్’గా పేరుగాంచింది. అంతటి ఎత్తు నుంచి మృతదేహాన్ని రికవరీ చేయడం సాధారణ విషయం కాదు. సాధారణంగా హెలికాప్టర్ ద్వారా మృతదేహాలను తరలించాలంటే కేవలం 6,400 మీటర్ల ఎత్తులో ఉండే క్యాంప్-2 వరకే వీలవుతుంది. కానీ తివారీ మరణించింది దాదాపు 8,800 మీటర్ల ఎత్తులో కావడం వల్ల.. అక్కడి నుంచి మృతదేహాన్ని మంచు గడ్డల నుంచి తవ్వి తీసి, తాడు సాయంతో క్యాంప్-2 వరకు మోసుకురావడానికి కనీసం 8 నుంచి 10 మంది అనుభవజ్ఞులైన షెర్పాలు ప్రాణాలకు తెగించి పోరాడాల్సి ఉంటుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎక్స్‌పెడిషన్ నిర్వహణ సంస్థ తొలుత 1.14 లక్షల డాలర్లు (రూ.1.1 కోట్లు) కోట్ చేయగా, ఆ తర్వాత మానవతా దృక్పథంతో 94,000 డాలర్లకు (సుమారు రూ.89.7 లక్షలు) తగ్గించింది. అయితే, ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం బతికున్న వారి రెస్క్యూ, హెలికాప్టర్ తరలింపునకే క్లెయిమ్ ఇస్తాయి తప్ప, మృతదేహాల రికవరీకి ఇవ్వవు.
**శివుడి చెంత ‘సమాధి’గా భావించిన కుటుంబం**
భారీ ఖర్చుతో పాటు, ఐదు రోజులు గడిచిపోవడం వల్ల ఆ ప్రాంతం మొత్తం దట్టమైన మంచుతో ముగిపోయిందని.. ఇప్పుడు మృతదేహం కోసం షెర్పాలను పంపితే వారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో తివారీ భార్య, ఇద్దరు కుమార్తెలు ఈ కఠిన నిర్ణయానికి వచ్చారు. కేవలం డబ్బు కోసమే కాకుండా, తమ మత విశ్వాసాల ప్రకారం హిమాలయాలను పార్వతీ దేవికి జన్మస్థానంగా, శివుడి నివాసమైన ‘దేవభూమి’గా భావిస్తామని తివారీ బావ సుధీర్ ఉపాధ్యాయ్ తెలిపారు. హిమాలయాలపై అరుణ్‌కు ఉన్న విపరీతమైన ప్రేమను గౌరవిస్తూ, ఆయన అక్కడ మరణించడాన్ని ఒక ‘సమాధి’గా భావిస్తున్నామని చెప్పారు. అంత ఎత్తున మంచులో గడ్డకట్టడం వల్ల ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉందని, తమ తండ్రి చితికిపోయిన రూపాన్ని పిల్లలు చూడటం ఇష్టం లేదని.. ఆయనకు ఇంతకంటే అద్భుతమైన అంతిమ విశ్రాంతి స్థలం మరొకటి ఉండదని భావించి పర్వతంపైనే వదిలేస్తున్నట్లు ప్రకటించారు.
**డాక్యుమెంటేషన్ పరంగా సమస్యలు**
ఎవరెస్ట్ శిఖర అధిరోహణ సమయంలో మరణించిన వారి మృతదేహాలు లభ్యం కానంత వరకు, ఖాట్మండులో అధికారికంగా గుర్తించనంత వరకు పర్వతారోహకుడిని పరిపాలనాపరంగా ‘అదృశ్యమైన వ్యక్తి’ (మిస్సింగ్) గానే పరిగణిస్తారని ఎక్స్‌పెడిషన్ నిర్వాహకులు తెలిపారు. మృతదేహం గుర్తింపు, పోస్టుమార్టం నివేదిక లేకపోతే డెత్ సర్టిఫికేట్ పొందడం చట్టపరంగా చాలా క్లిష్టతరంగా మారుతుందని పేర్కొన్నారు. ఎవరెస్ట్ చరిత్రలో ఇప్పటివరకు 344 మందికి పైగా పర్వతారోహకులు మరణించగా.. ఇలాంటి దుర్భర పరిస్థితులు, అసాధ్యమైన రెస్క్యూ కారణాల వల్లే దాదాపు 200 మందికి పైగా మృతదేహాలను పర్వతంపైనే శాశ్వతంగా వదిలేశారు. కాగా, ఇదే బృందంలో ఉండి మరణించిన మరో పర్వతారోహకుడు సందీప్ ఆరే (ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్) మృతదేహాన్ని మాత్రం రికవరీ చేశారు. ఆయన క్యాంప్-3 వద్ద మరణించడంతో షెర్పాలు సులువుగా క్యాంప్-2కు తీసుకువచ్చారని, అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఖాట్మండుకు తరలించగలిగారని అధికారులు వివరించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న టీమ్ లీడర్ లెఫ్టినెంట్ కల్నల్ బర్త్వాల్ సైతం తీవ్రమైన ఫ్రాస్ట్‌బైట్ (మంచు తాకిడి గాయాలు) బారిన పడటంతో, ఆయనకు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.