- టీడీపీ మరో చారిత్రక అడుగు
- మహిళలకు 33శాతం సీట్లు
- మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకేష్
అమరావతి, మహా : పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహానాడు వేదికపై నుంచి నారా లోకేష్ అతిపెద్ద అనౌన్స్మెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ మహిళలకోసం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని మహానాడు వేదికపై నుంచి ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా భవిష్యత్లో అన్ని ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడులో నారాలోకేష్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయని.. కానీ.. తెలుగుదేశం పార్టీ దానితో సంబంధం లేకుండానే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని లోకేష్ తెలిపారు.”మన స్త్రీశక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఒక ప్రతిపాదన చేస్తున్నాను. పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా, అవ్వకపోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి… వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలి… ఈ పవిత్ర మహానాడు వేదిక నుండి తాను ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు” నారా లోకేష్ ప్రకటించారు
మహిళా సాధికారత టీడీపీ విధానం.. నినాదం
మహిళా సాధికారతను టీడీపీ మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపుతుందని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తిరస్కరించి, మహిళా సాధికారతకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించాయి. ఎన్నికల సమయంలో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయి… కానీ ఎన్నికల తర్వాత మహిళలను మర్చిపోతాయి. కానీ తెలుగుదేశం విధానం.. నినాదం రెండూ మహిళల అభ్యున్నతే అని చెప్పారు. తాను విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాఠ్య పుస్తకాల్లో మహిళలు ఇంటి పనులు చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోలను మార్చి.. మగవారు కూడా ఆ పనులు చేస్తున్నట్లుగా చూపించామని.. ఇంటి నుంచే మహిళలపై గౌరవం పెరగాలన్నది తమ సిద్ధాంతమని లోకేష్ తెలిపారు
వచ్చే ఎన్నికల నుంచే అమలు
రాష్ట్రంలో 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% సీట్లను కేటాయించాలని నిర్ణయించింది. మహిళా సాధికారితకు ప్రాధాన్యం ఇస్తూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న అతి పెద్ద చారిత్రక ముందడుగు ఇదని లోకేష్ తెలిపారు. మహిళల అభ్యున్నతి మాటల్లో కాదని చేతల్లోనే చూపిస్తామని చెప్పారు. .”ఇది కేవలం ఒక నినాదంగా కాదు.. భారతదేశ భవిష్యత్తు పట్ల ఒక నిబద్ధతగా ఉండాలి. మాకు మరింత మంది మహిళా చట్టసభ సభ్యులు కావాలి… మరింత మంది మహిళా నాయకులు కావాలి… మరింత మంది మహిళా విధాన నిర్ణేతలు కావాలి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారు. ఇది మా సంకల్పం…ఇది మా బాధ్యత…ఇది మా కమిట్ మెంట్” అని స్పష్టం చేశారు. లోకేష్ తీర్మానం చేసిన తర్వాత మహిళా సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా హాజరైన వారు.. ఆన్లైన్ ద్వారా డిజిటల్ విధానంలో హాజరైన వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మొదటి పార్టీ తెలుగుదేశమే..
మహిళలకు పార్టీలో రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించడం ద్వారా తెలుగుదేశం ఓ ముందడుగు వేసింది. మహిళలకు సంబంధించి చారిత్రక నిర్ణయాలు తీసుకోవడంలో ఆ పార్టీకి ఇంతకు ముందు కూడా ట్రాక్ రికార్డ్ ఉంది. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిహక్కు కల్పిస్తే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యాసంస్థల్లో మహిళలకు ౩౩శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు పార్టీ అభ్యర్థుల్లో ౩౩శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా టీడీపీ మరో మందుడుగు వేసింది.








