Mahaa Daily Exclusive

  నేతల మధ్య ప్రోటోకాల్ రచ్చ….

Share

  • నేతల మధ్య ప్రోటోకాల్ రచ్చ
  • గాంధీ భవన్‌లో గలాటా
  • మంత్రుల ఎదుటే గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు

హైదరాబాద్, మహా : హైదరాబాద్ నగర కాంగ్రెస్ నేతల మధ్య ప్రొటోకాల్ రచ్చ చిలికి చిలికి గాలివానలా మారి, నేతలు బాహాబాహీకి దిగే వరకు వెళ్లింది. నాంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నేత ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య జరిగిన ఘర్షణతో పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ వంటి కీలక నేతలు వేదికపై ఉండగానే ఈ ఘటన జరగడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల బలోపేతంపై చర్చించేందుకు బుధవారం గాంధీ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేదికపై కూర్చునే విషయంలో నాంపల్లి, కార్వాన్ నేతల మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరినొకరు దూషించుకుంటూ గల్లాలు పట్టుకునే స్థాయికి గొడవ చేరింది. ఈ క్రమంలో ఉస్మాన్ గట్టిగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇది చూసిన ఫిరోజ్ ఖాన్ అనుచరులు ఆగ్రహంతో ఊగిపోవడంతో గాంధీ భవన్‌లో గందరగోళం ఏర్పడింది.

మంత్రుల ముందే ఫైటింగ్

వేదికపై ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ నేతలను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నేతలు ఇరువర్గాలుగా విడిపోయి పరస్పరం నినాదాలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. క్రమశిక్షణతో ఉండాలని మంత్రులు వారించినా ఎవరూ వినకపోవడంతో, పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన నేతలు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నగర కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు

హైదరాబాద్ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, ఇలా గాంధీ భవన్‌లో అందరి ముందే కొట్టుకోవడం కార్యకర్తల్లో అసహనాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా పాతబస్తీ పరిధిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు పార్టీకి నష్టం కలిగిస్తాయని భావిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పీసీసీ క్రమశిక్షణా కమిటీ, బాధ్యులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలను ఆదేశించారు.