తేల్చుకుందాం రా.
• ఇందిరమ్మ ఇళ్లపై బహిరంగ సవాల్.
• పదేళ్ల రికార్డును ఐదేళ్లలోనే బద్దలు కొడతా.
• ఎక్కువ ఇళ్లు కట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.
• పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమా?.
• కేటీఆర్‌కు పొంగులేటి షాక్!
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ మహా నగరంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల సుదీర్ఘ కాలంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కంటే.. తాము అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలోనే అంతకంటే ఎక్కువ ఇండ్లు కట్టి చూపించకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. “మరి నేను కట్టి చూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ముక్కునేలకు రాసి నువ్వు తప్పుకోవడానికి సిద్ధమా?” అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు సవాల్ విసిరారు.
బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఎక్కువ ఇళ్లను నిర్మించి చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ పాలన కంటే ఎక్కువ ఇండ్లు కట్టకపోతే తాను రాబోయే ఎన్నికల్లో అసలు పోటీనే చేయనని, ఒకవేళ తాము కట్టి నిరూపిస్తే కేటీఆర్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి సిద్ధమా అంటూ మంత్రి బహిరంగ సవాల్ విసిరారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ క్షేత్రస్థాయిలో కనీసం 45 వేల ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయారని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఎంతోమంది పేదలను ఆశపెట్టి మెజారిటీ ఇళ్లను సగానికి పైగా నిర్మించి అసంపూర్తిగా వదిలేశారని మండిపడ్డారు. పేదల గృహనిర్మాణంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కేటీఆర్ ముక్కు నేలకు రాసే రోజు వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌లకే పరిమితమైన వారికి పేదల కష్టాలు తెలియవని, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్కు సరైన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు.
ఇదే సమయంలో హైదరాబాద్ మహానగర పేదలకు మంత్రి పొంగులేటి ఒక పెద్ద శుభవార్త అందించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అత్యంత ఖరీదైన స్థలాల్లో మొదటి విడత కింద లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో హైదరాబాద్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపామని వివరించారు. అర్బన్ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను నెరవేరుస్తూనే, గ్రామీణ, గిరిజన ప్రాంతాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించామని, గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేకంగా మరో 5 వేల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కింద మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఘనంగా ప్రారంభించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.








