Mahaa Daily Exclusive

  టాకీస్ వివాదానికి ‘మెగా’ బ్రేక్….

Share

టాకీస్ వివాదానికి ‘మెగా’ బ్రేక్..
* కొలిక్కి వచ్చిన పర్సంటేజీ రగడ.
*చిత్రసీమ పెద్దగా చిరంజీవి విజయవంతమైన జోక్యం.
* జూన్ 4న యథావిధిగా రెంటల్ విధానంలోనే ‘పెద్ది’ సినిమా విడుదల.
* జూన్ 30 తర్వాతే కొత్త పద్ధతి అంటూ తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక ప్రకటన.
హైదరాబాద్, మహా.
తెలుగు చిత్రసీమలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పర్సంటేజీ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. థియేటర్ల యాజమాన్యాలు, సినిమా నిర్మాతల మధ్య లాభాల వాటాల విషయంలో రాజుకున్న ఈ రగడ పరిశ్రమను కాసేపు డైలమాలో పడేసినా, ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగడంతో వివాదం సుఖాంతమైంది. ఎగ్జిబిటర్ల సమస్యలను సావధానంగా విన్న చిరంజీవి, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మధ్యేమార్గం సూచించడంతో థియేటర్ల ఓనర్లు తమ పంతాన్ని కాస్త తగ్గించుకున్నారు. దీంతో సినిమా హాళ్లు మూతపడతాయేమో అని ఆందోళన చెందిన సామాన్య సినిమా ప్రేక్షకులు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఊరట చెందారు.
అసలు వివాదంలోకి వెళ్తే.. రాబోయే పెద్ద సినిమా ‘పెద్ది’ నుంచే ఖచ్చితంగా పర్సంటేజీ విధానాన్ని (టికెట్ వసూళ్లలో వాటా పద్ధతి) అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు గట్టి పట్టుబట్టారు. పాత పద్ధతి అయిన ఫిక్స్‌డ్ రెంటల్ (అద్దె బేసిస్) విధానం వల్ల తాము నష్టపోతున్నామని, సినిమా ఆడినా ఆడకపోయినా థియేటర్ల నిర్వహణ భారం పెరిగిపోతోందని వారు వాదించారు. ఈ క్రమంలోనే తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ తెలంగాణ ఎగ్జిబిటర్ల ప్రతినిధి బృందం మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో చిరంజీవి సుదీర్ఘంగా చర్చలు జరిపి, సినిమా ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో ఇలాంటి అకస్మాత్తు నిర్ణయాలు పరిశ్రమను దెబ్బతీస్తాయని నచ్చజెప్పడంతో ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసేందుకు అంగీకరించారు.
మెగాస్టార్‌తో జరిగిన ఈ తాజా సమావేశం అనంతరం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. జూన్ 4వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల కానున్న ‘పెద్ది’ చిత్రాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా పాత పద్ధతి అయిన రెంటల్ విధానంలోనే ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. అయితే, పర్సంటేజీ విధానంపై తమ డిమాండ్ అలాగే ఉంటుందని, జూన్ 30వ తేదీ తర్వాత థియేటర్లలోకి వచ్చే అన్ని చిత్రాలకు ఖచ్చితంగా పర్సంటేజీ విధానాన్ని వర్తింపజేస్తామని వారు తేల్చి చెప్పారు. ఎగ్జిబిటర్లు పరిశ్రమ హితం కోరి తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంపై చిరంజీవి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఏ నిర్ణయమైనా ఏకపక్షంగా కాకుండా, ఫిల్మ్ ఛాంబర్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారమే అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. మొత్తానికి ‘మెగా’ జోక్యంతో ఒక పెద్ద సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో తలెత్తిన పెద్ద సంక్షోభం తృటిలో తప్పినట్లయింది.