Mahaa Daily Exclusive

  తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే….

Share

  • తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే
  • రైతుల పక్షాన నిలబడేది బీజేపీనే
  • ధాన్యం చివరి గింజా కొనేవరకు వదిలి పెట్టం
  • యువత, మహిళలు బీజేపీ వైపు చూస్తున్నారు
  • శిక్షణా తరగతుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా

మొయినాబాద్, మహా : రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, ఇక్కడ కూడా “డబుల్ ఇంజన్ సర్కార్” ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లా నుంచే మొదలువుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. కార్యకర్తలంతా విభేదాలు పక్కనపెట్టి, సమన్వయంతో ఒక బృహత్తర లక్ష్యంతో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహా అభియాన్ తరగతుల్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలంతో పాటు పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించడానికే ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మెంటాలిటీ ఒకటేనని, యువతను రెచ్చగొట్టి రైల్వే స్టేషన్లు, ఆఫీసులు తగలబెట్టించే విచ్ఛిన్నకర శక్తులకు ఇరు పార్టీల నేతలు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని విమర్శించారు. రైతులకు ఇస్తామన్న రూ. 15 వేల రైతు భరోసా ఇప్పటివరకు సరిగ్గా ఇవ్వలేదని, ఒకటో తేదీన జీతాలు ఇస్తామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఉద్యోగులకు, రిటైర్డ్ సిబ్బందికి పెన్షన్లు, బెనిఫిట్స్ ఇవ్వలేని చేతగాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అనేక చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధాన్యం, మక్కలు, జొన్నలు తడిసి ముద్దయ్యాయని, కొనే నాథుడు లేక రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “చివరి గింజ వరకు కొంటామని” చెప్పి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తన చేతగానితనాన్ని కేంద్రం మీదకు నెడుతోందని విమర్శించారు. రైతుల హక్కుల కోసం బిజెపి చేపట్టిన ‘రైతు గోస – బిజెపి భరోసా’ యాత్ర నిర్మల్ (సారంగపూర్) తో ముగిసినా.. రైతులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాటం ఆగదని హెచ్చరించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, హౌస్ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశంలో అవినీతి రహిత, ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ సరికొత్త రికార్డు సృష్టించారని రాంచందర్ రావు కొనియాడారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. భారతదేశం ఆర్థికంగా దూసుకుపోతూ త్వరలోనే మూడో స్థానానికి చేరబోతుందని, మోదీ దార్శనికతతో ‘వికసిత్ భారత్’ సాధించి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం గత 12 ఏళ్లలో సుమారు రూ. 13 లక్షల కోట్లు కేటాయించిందని.. ప్రతినెలా 5 కిలోల ఉచిత బియ్యం, జాతీయ రహదారులు, ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, బీబీనగర్ ఎయిమ్స్, వరంగల్-ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, జన్ ధన్ ఖాతాలు ఇవన్నీ మోదీ వల్లే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.

కార్యకర్తల శ్రమ, త్యాగాలు, ఎందరో సీనియర్ నాయకుల త్యాగాలతో నిర్మితమైన బిజెపి.. క్రమశిక్షణ గల ‘క్యాడర్ బేస్’ పార్టీ నుండి నేడు ప్రజల్లోకి దూసుకెళ్లి ‘మాస్ బేస్’ పార్టీగా అవతరిస్తోందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్ల విసిగిపోయిన యువత, మహిళలు, ఐటీ ఉద్యోగులు, విద్యావంతులు ఒక కొత్త రాజకీయ మార్పును కోరుకుంటున్నారని, ఆ నమ్మకమే బిజెపి అని తెలిపారు. బిజెపి సిద్ధాంతంలో, మేనిఫెస్టోలో భాగమైన ఆర్టికల్ 370 రద్దును ఏ విధంగా సాధించామో, అదే విధంగా దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా అంతే అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తరాఖండ్, గోవా, అస్సాం రాష్ట్రాలు ఈ చట్టాన్ని తీసుకొచ్చాయని.. అస్సాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రశంసనీయమని కొనియాడారు.