- కర్నాటకలో ఖాయమైన అధికార మార్పిడి
- సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా
- రాజీనామా లేఖను లోక్ భవన్ లో అందజేత
- అధిషఅటానం ఆదేశాలతోనే రాజీనామా చేశానన్న సిద్దరామయ్య
- తదుపరి సీఎంగా డీకే శివకుమార్
బెంగళూరు, మహా : కర్నాటకలో అధికార మార్పిడి ఖాయమంటూ గత కొన్నాళ్ళుగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. గురువారం ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లిన సిద్దరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తన స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు గవర్నర్ వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సిద్దరామయ్య రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారు. తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిద్దరామయ్య కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
పొరపాటున రాజకీయాల్లోకి వచ్చాను: సిద్ధరామయ్య
రాజీనామా సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య భావోద్వేగానికి గురయ్యారు. తాను పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానని సిద్ధరామయ్య చెప్పారు. సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదన్నారు. తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని ఆయన వివరించారు. సామాజిక న్యాయం, సమానత్వాన్ని నమ్ముతానని తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగాలని కోరుకుంటానని వెల్లడించారు. అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నారు. తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పారు. “రాజీనామా లేఖ సమర్పించాను. గవర్నర్ ప్రస్తుతం బెంగళూరులో లేరు. గవర్నర్ లేకపోవడంతో లేఖను కార్యదర్శికి ఇచ్చాను. అధిష్ఠానం సూచనలతో రాజీనామా చేశాను. హైకమాండ్ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటాం. నా రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తారనే విశ్వాసం ఉంది. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ నా రాజీనామా ఆమోదిస్తారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉంది. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. సీఎంగా నాకు అవకాశమిచ్చిన సోనియా, రాహుల్, ఖర్గేకు ధన్యవాదాలు. 7 కోట్ల మంది కర్ణాటక ప్రజలకు సేవలందించే అవకాశం వచ్చింది. రాజ్యాంగమే మా ధర్మం ప్రజలే మా దేవుళ్లు. నేను పొరపాటున రాజకీయాల్లోకి వచ్చాను. సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదు. నా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరాను. పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ నన్ను ఆదరించింది. సీఎంగా, ఎల్‌వోపీగా రెండుసార్లు సేవలందించాను. ఏడు కోట్ల కన్నడ ప్రజలకు సేవలందించాను. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చే యత్నం చేశాను. మేనిఫెస్టోలో ఇచ్చిన 160 హామీల్లో 158 నెరవేర్చాను. మొదటి ఏడాదిలోనే ఐదు గ్యారంటీలు నెరవేర్చాను. శాసనసభలో మాకు పూర్తి మెజారిటీ ఉంది. నాపై ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేశాయి. తలసరి ఆదాయంలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. జీఎస్టీ వసూళ్లలో కర్ణాటక రెండో స్థానంలో ఉంది.” అని సిద్ధరామయ్య అన్నారు.
సీఎం పదవి చేపట్టనున్న డీకే శివకుమార్
అంతకుముందు ఈ ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన రాజీనామా విషయాన్ని మంత్రులకు తెలియజేసిన సిద్దరామయ్య తదుపరి సీఎం డీకే శివకుమార్ అని ప్రకటించారు. సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత వారిద్దరూ ఆలింగనం చేసుకున్నారు.
మద్ధతు దారుల ఆందోళన
ఇదిలా ఉండగా సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. శివమొగ్గలోని శివప్ప నాయక సర్కిల్ వద్ద ఆయన మద్దతుదారులు ధర్నాకు దిగారు. కురుబ సామాజికవర్గానికి చెందిన నేతలు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. రెండు పొట్టేళ్లను కూడా ఘటనా స్థలానికి తీసుకువచ్చారు. సిద్ధరామయ్య నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రోడ్డుపై టైర్లను తగులబెట్టారు. సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అన్న రామయ్య అహిందా నేత సిద్ధరామయ్య అంటూ ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలని డిమాండ్ చేశారు. యాద్గిర్‌లో సిద్ధరామయ్య వీరాభిమాని రాజ్‌కుమార్ గణీర్ అనే వ్యక్తి సుభాష్ చంద్ర సర్కిల్ వద్ద మౌనప్రదర్శనకు దిగారు. ఆయన రాజీనామా నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.








