- శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్
- ఎన్టీఆర్ స్కూల్ నిర్మాణం పూర్తి చేయాలన్న ఎమ్మెల్యే
కూకట్ పల్లి, మహా : శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు నందమూరి తారకరామారావు పేరును పెట్టాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని వసంత్ నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిందే ఎన్టీఆర్ స్ఫూర్తితో అని వెల్లడించారు. తనకు ఓటు హక్కు వచ్చిన తర్వాత తొలి ఓటును టీడీపీకే వేశానని.. అందుకు కారణం ఎన్టీఆరేనని గుర్తు చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమయంలో చేసిన అరాచకాలను తట్టుకోలేక ఎన్టీఆర్.. టీడీపీని ఏర్పాటు చేసి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని ఎమ్మెల్యే మాధవరం గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేశారని.. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీసుకువచ్చి.. పేదల ఆకలి తీర్చారని వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు.. ఇప్పుడు ఎన్నో పార్టీలకు ఆదర్శమని గుర్తు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు.. కేపీహెచ్‌బీలోని 3 ఎకరాల్లో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎన్టీఆర్ పేరు మీద ఒక పాఠశాల భవనాన్ని ప్రారంభించామని, దాన్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాధవరం కృష్ణారావు తేల్చి చెప్పారు.








