ఎస్జీబీ ఇన్వెస్టర్లకు జాక్‌పాట్.
* ఐదేళ్లలోనే 227 శాతం రాబడి.
* ఆర్బీఐ ముందస్తు విమోచన ధర యూనిట్‌కు రూ.15,672గా ఖరారు.
ముంబై, మహా.
సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీపికబురు అందించింది. ‘ఎస్జీబీ 2021-22 సిరీస్-II’ కింద ఐదేళ్ల క్రితం జారీ చేసిన బాండ్లకు సంబంధించి ముందస్తు విమోచన (ప్రీమెచ్యూర్ రిడెంప్షన్) ధరను ప్రకటించింది. పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపిస్తూ ఏకంగా 227 శాతం అద్భుతమైన లాభాన్ని అందిస్తూ.. ఒక్కో యూనిట్ (గ్రాము) ధరను రూ.15,672గా ఖరారు చేసింది. దీంతో ఐదేళ్ల కిందట ఈ పథకంలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారి సంపద ఇప్పుడు ఏకంగా రూ.3.27 లక్షలకు చేరడం విశేషం.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసిన ఐదేళ్ల తర్వాత నుంచి, వడ్డీ చెల్లించే తేదీల్లో వాటిని ముందస్తుగా నగదు రూపంలోకి మార్చుకునే (విత్‌డ్రా) వెసులుబాటు ఉంటుంది. ఈ సిరీస్ బాండ్లను ఆర్బీఐ 2021 జూన్ 1న జారీ చేసింది. వీటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి పెట్టుబడిదారులు తమ బాండ్లను విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్ర బ్యాంకు పచ్చజెండా ఊపింది. సాధారణంగా ఎస్‌జీబీల కాలపరిమితి ఎనిమిదేళ్లు అయినప్పటికీ.. ఐదేళ్లకే ఈ స్థాయిలో లాభాలు రావడం ఇన్వెస్టర్లకు ఎంతో లాభదాయకంగా మారింది.
2021లో ఈ బాండ్లను జారీ చేసిన సమయంలో ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఒక గ్రాము ధర రూ.4,792 కాగా, ఆఫ్‌లైన్‌లో కొన్నవారికి రూ.4,842గా నిర్ణయించారు. తాజాగా ఆర్బీఐ ప్రకటించిన విమోచన ధర రూ.15,672తో పోల్చి చూస్తే.. ఆన్లైన్ ఇన్వెస్టర్లకు ప్రతి గ్రాముపై వడ్డీ కాకుండానే అదనంగా రూ.10,880 నికర లాభం సమకూరుతోంది. అంటే ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే వారి పెట్టుబడిపై 227.05 శాతం రాబడి లభించిందన్నమాట. ఎస్జీబీ చరిత్రలోనే ఇది అత్యుత్తమ రాబడుల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు.
ఈ ముందస్తు విమోచన ధరను నిర్ధారించడానికి ఆర్బీఐ ఒక నిర్దిష్ట ప్రామాణిక పద్ధతిని పాటిస్తుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే 999 స్వచ్ఛత గల బంగారం ముగింపు ధరల ఆధారంగా దీనిని లెక్కిస్తారు. విమోచన తేదీకి ముందున్న మూడు పని దినాల సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో భాగంగానే మే 26, మే 27, మే 29 తేదీల్లో నమోదైన బంగారం సగటు ధరల ఆధారంగా యూనిట్ విలువను రూ.15,672గా ఆర్బీఐ అధికారికంగా నిర్ణయించింది.






