Mahaa Daily Exclusive

  శోకసంద్రంలో అజిత్ కుటుంబం…..

Share

శోకసంద్రంలో అజిత్ కుటుంబం.
* మాతృమూర్తి మోహినికి సీఎం విజయ్‌, త్రిష నివాళి.
చెన్నై,మహా.
ప్రముఖ కోలీవుడ్‌ అగ్రకథానాయకుడు అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. చెన్నైలోని ఈసీఆర్ (ఈస్ట్ కోస్ట్ రోడ్) లో ఉంటున్న ఆయన మాతృమూర్తి మోహిని మణి (85) వయోభారం, అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఆమె తుదిశ్వాస విడవడంతో అజిత్‌ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మ మరణంతో విషాదంలో మునిగిపోయిన అజిత్‌కు మనోధైర్యం కల్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివెళ్తున్నారు.
కోల్‌కతాకు చెందిన సింధీ కుటుంబంలో జన్మించిన మోహిని.. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మలయాళీ పి. సుబ్రహ్మణ్యాన్ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, సుబ్రహ్మణ్యం 2023లో వయోభారంతో కన్నుమూశారు. వీరి పెద్ద కుమారుడు అనూప్ కుమార్ పెట్టుబడిదారుడిగా స్థిరపడగా, రెండో కుమారుడు అజిత్ కుమార్ దక్షిణాది అగ్ర హీరోగా ఎదిగారు. చిన్న కుమారుడు అనిల్ కుమార్ ఐఐటీ మద్రాస్‌లో విద్యాభ్యాసం చేసి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న తల్లి కూడా ఇప్పుడు దూరం కావడంతో ఈ ముగ్గురు సోదరులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
ఈ కష్ట సమయంలో అజిత్‌ కుటుంబానికి బాసటగా నిలిచేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర నటుడు విజయ్‌తో పాటు ప్రముఖ కథానాయిక త్రిష కృష్ణన్‌ చెన్నైలోని అజిత్ స్వగృహానికి వెళ్లారు. మోహిని మణి పార్థివదేహాన్ని సందర్శించి అశ్రునయనాలతో నివాళులర్పించారు. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో అజిత్, విజయ్ మధ్య ఉన్న స్నేహబంధం నేపథ్యంలో.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ విజయ్ స్వయంగా వెళ్లి అజిత్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మోహిని మణి మరణవార్తతో యావత్ తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌, సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అజిత్‌ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు. తమ అభిమాన నటుడికి ఎదురైన ఈ తీవ్ర మాతృవియోగం పట్ల అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తూ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.