ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో విస్తృత మార్పులు.
• విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల్లో పురోగతి.
• ప్రజల సాధికారత పెరిగిందన్న ప్రధాని మోదీ.
ఢిల్లీ, మహా.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంత ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు విద్య, వైద్యం, వ్యాపారం, క్రీడా రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దై ఏడేళ్లు పూర్తైన సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) చరిత్రలో కలిసిపోయాయని, ఆ నిర్ణయంతో జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ అభివృద్ధి ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకి రావడంతో దశాబ్దాలుగా రాజ్యాంగ హక్కులకు దూరమైన మహిళలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఇప్పుడు సాధికారత సాధించారని తెలిపారు. ప్రతి పౌరుడు పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామి కావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీని ప్రధాని స్మరించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన కలలు 2019 ఆగస్టు 5న సాకారమయ్యాయని పేర్కొన్నారు.
మరోవైపు, జమ్మూకశ్మీర్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శ్రీనగర్‌కు యునెస్కో క్రియేటివ్ సిటీ, వరల్డ్ క్రాఫ్ట్ సిటీ గుర్తింపులు రావడం, రికార్డు స్థాయిలో పర్యాటకులు రావడం, హస్తకళలకు అంతర్జాతీయ ఆదరణ పెరగడం ఈ పురోగతికి నిదర్శనమని పేర్కొంది. కశ్మీర్ కళా వారసత్వం, ప్రకృతి సౌందర్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని తెలిపింది.
ఆధ్యాత్మిక పర్యాటకం కూడా గణనీయంగా పెరిగిందని కేంద్రం వెల్లడించింది. 2026లో వైష్ణోదేవి ఆలయాన్ని 50 లక్షలకు పైగా భక్తులు దర్శించుకోగా, అమర్‌నాథ్ యాత్రను 4 లక్షలకు పైగా యాత్రికులు పూర్తి చేసినట్లు పేర్కొంది. ప్రజల్లో విశ్వాసం, భద్రతా వాతావరణం బలపడటంతో జమ్మూకశ్మీర్‌లో పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.







