తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.
* అన్నామలై రాజీనామా వెనక్కి తీసుకుంటారా?
చెన్నై , మహా.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కొత్త ఊపు తెచ్చిన యువ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై రాజీనామా ఎపిసోడ్ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఎలాగైనా ఆయనను పార్టీలోనే అట్టిపెట్టుకోవాలని బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఆయన ఇచ్చిన రాజీనామా లేఖపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని హైకమాండ్, బుజ్జగింపుల పర్వాన్ని వేగవంతం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి ఆయనను వారించే ప్రయత్నం చేస్తున్నారు.
**అసంతృప్తికి ప్రధాన కారణాలివే.**
అన్నాడీఎంకేతో పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. తమిళనాడులో బీజేపీ సొంతంగా బలపడుతున్న ప్రస్తుత తరుణంలో, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్ణయాలతో విభేదిస్తూ ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా, సొంతంగా ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి నేరుగా వెళ్లి తన రాజకీయ భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
**రంగంలోకి మోదీ-షా ద్వయం.. బంపర్ ఆఫర్లు**
అన్నామలై వ్యవహార శైలి, రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చిన మార్పులను గుర్తించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనను వదులుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. ఆయన్ను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. అన్నామలై లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారాలు చూపుతూనే, భవిష్యత్తుపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అధిష్టానం ముందుంచినట్లు సమాచారం. ముఖ్యంగా అన్నామలై సొంతంగా చేయాలనుకుంటున్న పాదయాత్రను కొత్త పార్టీ ప్రస్తావన లేకుండా, బీజేపీ జెండా పైనే మరింత భారీ స్థాయిలో నిర్వహించేలా పూర్తి మద్దతు ఇస్తామని, అడ్డంకులన్నీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. దానికి తోడు, ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామనే ప్రతిపాదన కూడా చేసినట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి.
**ప్రధానితో భేటీపైనే సర్వత్రా ఆసక్తి**
అధిష్టానం ఇన్ని ఆఫర్లు ఇస్తున్నప్పటికీ అన్నామలై మాత్రం వాటిపై ఇంకా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. తన వాదనలను, రాష్ట్రంలో పార్టీ వాస్తవ పరిస్థితిని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించాలని ఆయన భావిస్తున్నారు. ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాతే తన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, అధిష్టానం సూచనలకు అంగీకరించి మనసు మార్చుకుంటేనే ప్రధానితో భేటీకి అవకాశం ఉంటుందని పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.







