శ్రీవారి ప్రసాదం కల్తీపై ఈడీ కొరడా.
* మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతం.
* దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు.
* రూ.45 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు.
* రూ.60 లక్షల నగదు సీజ్.
*వెలుగులోకి నెయ్యి సరఫరాదారుల బాగోతం.
* కీలక డాక్యుమెంట్లు స్వాధీనం.
తిరుమల, మహా.
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. భక్తుల మనోభావాలను తీవ్రంగా కలచివేసిన ఈ మహా పాపం వెనుక జరిగిన ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇదివరకే నమోదు చేసిన కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు బృందాలు.. మనీ లాండరింగ్ (అక్రమ నగదు చలామణి) కోణంలో లోతైన విచారణ ప్రారంభించాయి. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారుల బండారం బయటపెట్టేందుకు దేశవ్యాప్తంగా ఏకకాలంలో సంచలన దాడులకు శ్రీకారం చుట్టాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏకంగా 15 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈడీ ప్రత్యేక బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా చేసిన పలు వివాదాస్పద డెయిరీ కంపెనీల కార్యాలయాలు, వాటికి సంబంధించిన కీలక వ్యక్తుల ఇళ్లే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని ముంబై, అహల్యానగర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, రూర్కీ, రాజస్థాన్‌లోని బికనీర్, తమిళనాడులోని దిండిగల్ తదితర ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కల్తీ నెయ్యి దందాలో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ కంపెనీలైన దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీస్ ప్రైవేటు లిమిటెడ్, అహల్యా నగర్‌లోని మాల్ గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్, రూర్కీ కేంద్రంగా పనిచేస్తున్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కంపెనీల కార్యాలయాలను జల్లెడ పట్టారు.
ఈ మహా కుంభకోణంలో కీలక నిందితులుగా భావిస్తున్న పలువురి ఇళ్లలో అధికారులు అణువణువూ గాలించారు. ముఖ్యంగా పొమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ మన్సుఖ్‌లాల్, అపూర్వ వినయకాంత్, శాంతారామ్ తదితరుల నివాసాలు, వారి వ్యాపార సంస్థల్లో ఉదయం నుంచే ఈ తనిఖీలు సాగాయి. పవిత్రమైన స్వామివారి లడ్డూ ప్రసాదంలో నాసిరకం, జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని అంటగట్టి అక్రమంగా కోట్లు గడించిన తీరును ఈడీ అధికారులు పసిగట్టారు. ఈ సోదాల్లో అక్రమార్కులు కూడబెట్టిన భారీ ఆస్తుల గుట్టు రట్టయింది. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా వచ్చిన నల్లధనంతో నిందితులు స్థిర, చరాస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలా అక్రమంగా సంపాదించిన దాదాపు రూ.45 కోట్ల మేర సొమ్మును వివిధ ఆస్తులపై పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ముమ్మర సోదాల పర్వంలో అధికారులు హవాలా మార్గంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పక్కా ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో దాదాపు రూ.60 లక్షల వరకు నగదు (లిక్విడ్ క్యాష్)ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, బినామీ పేర్లతో కొనుగోలు చేసిన పలు కీలకమైన ఆస్తి డాక్యుమెంట్లను, డెయిరీ కంపెనీల ఖాతా పుస్తకాలను, డిజిటల్ రికార్డులను సీజ్ చేశారు. స్వామి వారి ప్రసాదం తయారీని సైతం వ్యాపారంగా మార్చుకుని, కల్తీ ద్వారా వచ్చిన నల్లధనాన్ని హవాలా రూపంలో ఎక్కడెక్కడికి మళ్లించారు? షెల్ కంపెనీల ద్వారా నిధులను ఎలా దారి మళ్లించారు? ఇందులో తెరవెనుక ఉండి నడిపించిన బడా బాబులు ఎవరు? అక్రమార్జనలో ఎవరెవరికి వాటాలు అందాయి? అనే కోణంలో ఈడీ అధికారులు కూలంకషంగా ఆరా తీస్తున్నారు.
టీటీడీ టెండర్ల ప్రక్రియలో నిబంధనలను ఎలా ఉల్లంఘించారు, కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఎవరెవరికి ముడుపులు చెల్లించారన్న దానిపై ఈ డాక్యుమెంట్లు కీలక ఆధారాలు కానున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కల్తీ నెయ్యి కుంభకోణంలో ఈడీ ప్రవేశంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది. రానున్న రోజుల్లో ఈ కేసులో సీజ్ చేసిన పత్రాల ఆధారంగా మరింత మందిని విచారించే అవకాశం ఉందని, తద్వారా ఈ పాపంలో పాలుపంచుకున్న అసలు దోషులెవరో త్వరలోనే చట్టం ముందు నిలబడక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.








