Mahaa Daily Exclusive

  తెలంగాణ.. జర్మనీ సరికొత్త మైత్రి….

Share

తెలంగాణ.. జర్మనీ సరికొత్త మైత్రి.
* నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక రంగాల్లో థూరింగియా రాష్ట్రంతో కీలక ఒప్పందం.
* హైదరాబాద్‌లో ‘జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ హబ్’ ఏర్పాటుకు సీఎం రేవంత్ ప్రతిపాదన.
* యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి జర్మనీ సాంకేతిక సహకారం.
*పెట్టుబడుల కోసం రాష్ట్రానికి రానున్న జర్మన్ సెమీకండక్టర్ల బృందం.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న శాస్త్ర, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, జీవ వైజ్ఞానిక రంగాల్లో మరింత ప్రగతి సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జర్మనీకి చెందిన థూరింగియా రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర సహకారమే లక్ష్యంగా చారిత్రక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. భారత్ పర్యటనలో ఉన్న థూరింగియా రాష్ట్ర మినిస్టర్-ప్రెసిడెంట్ మారియో ఫోకట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైంది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్న ఈ కీలక సమావేశంలోనే ఇరు ప్రభుత్వాల మధ్య ఈ కీలక ఒప్పందాలపై లాంఛనంగా సంతకాలు జరిగాయి.

**ఏఐ యుగానికి తగ్గట్టుగా నైపుణ్యాల పెంపు**

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యువతను సన్నద్ధం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత యుగంలో, మారుతున్న ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని స్పష్టం చేశారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల పారిశ్రామిక అవసరాలను తీర్చగల స్థాయిలో మన స్కిల్లింగ్ కార్యక్రమాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ,అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు పాలిటెక్నిక్ విద్యాసంస్థల పాఠ్యాంశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు థూరింగియా ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రపంచ సాంకేతిక రంగంలో, మరీ ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ లాంటి అంతర్జాతీయ కేంద్రాల్లో తెలంగాణకు చెందిన ఐటీ నిపుణులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు.

**హైదరాబాద్‌లో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ హబ్**

కృత్రిమ మేధస్సు రంగం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలతో పాటు భాషా ప్రావీణ్యం కూడా ఎంతో ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా థూరింగియా రాష్ట్ర సహకారంతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఒక ‘జర్మన్ భాషా శిక్షణా కేంద్రం’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జర్మనీ పరిశ్రమలకు భవిష్యత్తులో అవసరమయ్యే మానవ వనరులను ముందుగానే గుర్తిస్తే, అందుకు అనుగుణంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని ప్రపంచ స్థాయి పెట్టుబడులు, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యాలను ప్రతినిధి బృందానికి వివరించారు. ఫార్చూన్-500 కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, భౌగోళిక-రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ 2025 మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా 100కు పైగా దేశాల ప్రతినిధులకు హైదరాబాద్ విజయవంతంగా ఆతిథ్యం ఇవ్వడం ఇక్కడి అంతర్జాతీయ మౌలిక సదుపాయాలకు నిదర్శనమని సీఎం ఉద్ఘాటించారు.

**అభివృద్ధి, ఆవిష్కరణల్లో తెలంగాణ అగ్రగామి: మారియో ఫోకట్**

ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై థూరింగియా రాష్ట్ర మినిస్టర్-ప్రెసిడెంట్ మారియో ఫోకట్ సానుకూలంగా స్పందించారు. దేశంలోనే అభివృద్ధి, ఆవిష్కరణలకు తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు. భారత్ – జర్మనీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్న తరుణంలో ఈ ఒప్పందంతో తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. తెలంగాణ, థూరింగియాలోని ప్రముఖ పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను సంయుక్తంగా రూపొందించవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా, త్వరలోనే జర్మనీకి చెందిన సెమీకండక్టర్ కంపెనీల ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని అధికారికంగా తెలంగాణకు తీసుకొచ్చి, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తామని ఫోకట్ ప్రకటించారు.
మంత్రి మారియో ఫోకట్ చేసిన సెమీకండక్టర్ల బృందం పర్యటన ప్రతిపాదనను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ ద్వారా ఇప్పటికే జర్మన్ భాషలో యువతకు శిక్షణ ఇస్తున్నామని, విదేశీ ఉపాధి అవకాశాల కల్పనలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని ప్రతినిధి బృందానికి వివరించారు.
ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో థూరింగియా రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర కార్యదర్శులు ప్రొఫెసర్ టైకుర్ట్, షూకర్ట్, చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ పాల్గొన్నారు. వారితో పాటు ఆప్టిక్స్, ఫోటోనిక్స్, ప్రిసిషన్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్, మెడ్‌టెక్, రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు చెందిన పలువురు జర్మనీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు చర్చల్లో భాగస్వాములయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.