Mahaa Daily Exclusive

  దమ్ముంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి రా…

Share

దమ్ముంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి రా.
*జనసేన కనుమరుగవుతుందేమో కానీ కమ్యూనిజం చావదు.
* ఆంధ్ర, తెలంగాణ అంటూ మళ్లీ పనికిమాలిన రాద్ధాంతం ఎందుకు?
* పవన్‌కు ఆవేశం తప్ప రాజకీయం ఏమీ తెలియదంటూ తీవ్రస్థాయిలో ధ్వజం.
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
హైదరాబాద్, మహా.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణపై, కమ్యూనిజంపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతో బాధాకరమని పేర్కొంటూ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అపరిచితుడిలా వస్తా, ఇక్కడే తిరుగుతా అని పవన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని, ఇక్కడ తిరిగేందుకు ఆయనను ఎవరొద్దన్నారని సూటిగా ప్రశ్నించారు. దమ్ముంటే ఏపీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ఇక్కడే ఉండాలని సవాల్ విసిరారు. పవన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఇంకెవరి ప్రయోజనాల కోసమో మళ్లీ ఆంధ్రా, తెలంగాణ అంటూ పనికిమాలిన రాద్ధాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక్కడికి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడటం, సవాళ్లు విసరడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిజమైన అపరిచితుడు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా పవన్ కల్యాణే అని కూనంనేని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రాంతీయవాదం మరింత పెరిగే ప్రమాదం ఉందని, తెలంగాణలో ఆయనకు వచ్చిన పూనకం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
కమ్యూనిస్టుల మీద, కమ్యూనిజం మీద పవన్ చేసిన వ్యాఖ్యలను కూనంనేని తీవ్రంగా ఖండించారు. తాను, తన తండ్రి కమ్యూనిస్టులమని గతంలో పదేపదే చెప్పుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆ కమ్యూనిజం ఏమైపోయిందని ప్రశ్నించారు. ఒకప్పుడు కమ్యూనిస్టు జెండా మోసిన ఆయన, నేడు కమ్యూనిజం చచ్చిపోయిందని మాట్లాడటం ఆయన అమాయకత్వానికి, రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. కమ్యూనిజం చచ్చిపోయిందని పవన్‌కు ఎవరు చెప్పారని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కనుమరుగవుతుందేమో కానీ, కమ్యూనిజం ఎన్నటికీ చచ్చిపోదని ఆయన తేల్చిచెప్పారు. కమ్యూనిస్టులైన తాము ఎల్లప్పుడూ ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తాం తప్ప, డిప్యూటీ సీఎం పదవుల కోసం పాకులాడబోమని చురకలంటించారు. ‘ప్రపంచ కార్మికులారా విడిపోండి’ అని తామెప్పుడూ చెప్పలేదని పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా అవమానిస్తే సంగతి చూస్తానని పవన్ హెచ్చరిస్తున్నారని, అసలు సనాతన ధర్మాన్ని ఇక్కడ ఎవరు అవమానించారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ లేదు కాబట్టే పవన్ నాడు రాష్ట్ర విభజనను సైతం తప్పుబట్టారని విమర్శించారు.
ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద పవన్ చేసిన వ్యాఖ్యలను సైతం కూనంనేని తప్పుబట్టారు. గత 40 ఏళ్లలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నడూ మాట తూలలేదని, ఒకవేళ పొరపాటున మాట్లాడినా వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. ఆ విషయం అక్కడితో ముగిసినప్పటికీ పవన్ కల్యాణ్ ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. వస్తా.. చూస్తా.. అంటున్న పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి ఏమీ చూస్తారని నిలదీశారు. పవన్ కల్యాణ్‌కు ఒక స్థిరమైన సిద్ధాంతం, ఓపిక లేవని, ఆవేశం తప్ప ఆయనకు రాజకీయం ఏమీ తెలియదని కూనంనేని వ్యాఖ్యానించారు. తెలంగాణకు రావొద్దని పవన్‌ను ఎవరూ అడ్డుకోలేదని, అలాంటప్పుడు ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు తాను కారు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం అవసరమా అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, దేశంలో పెరిగిపోతున్న నిత్యావసరాలు, అధిక ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేయనున్నట్లు కూనంనేని సాంబశివరావు ఈ మీడియా సమావేశంలో వెల్లడించారు.