Mahaa Daily Exclusive

  రేపటి నుంచే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు….

Share

రేపటి నుంచే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు.
* శాస్త్రీయ పద్ధతిలో భూముల మార్కెట్ విలువల సవరణ.
* క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా నూతన రేట్ల ఖరారు.
* గత ప్రభుత్వ అశాస్త్రీయ విధానాలకు చెక్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్.
* ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌లో అసమానతల తొలగింపు.. నిర్మాణ వ్యయాల రేట్ల సవరణ.
* అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని శాస్త్రీయ పద్ధతిలో సవరించిన నూతన భూముల విలువలు ఈ నెల 5వ తేదీ (ఎల్లుండి) నుంచి అధికారికంగా అమలులోకి రానున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను సరిచేస్తూ, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

**నిపుణుల కమిటీల విస్తృత అధ్యయనం ఆధారంగానే.**

గత ప్రభుత్వాల తరహాలో గదిలో కూర్చుని కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంతో శాస్త్రీయంగా ఈ రేట్ల సవరణ జరిగింది. ప్రముఖ ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం అందించిన ప్రత్యేక నివేదిక, ఉన్నతాధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం చేసిన అనంతరమే నూతన రేట్లను ఖరారు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గ్రామీణ, పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు నెలల తరబడి శ్రమించాయి. స్థానిక భౌగోళిక పరిస్థితులను, రిజిస్ట్రేషన్ల సంఖ్యను సమగ్రంగా పరిశీలించి ఈ నూతన విలువలను ఆమోదించాయి.

**బీఆర్ఎస్ అశాస్త్రీయ విధానాలతోనే అసలు సమస్య**

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి క్షేత్రస్థాయి కసరత్తు లేకుండా, కేవలం శాతం గణనల పట్టికల ఆధారంగా రేట్లను అడ్డగోలుగా పెంచారని మంత్రి పొంగులేటి తీవ్రంగా విమర్శించారు. 2021-22 సంవత్సరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండుసార్లు భూముల ధరలను ఏకపక్షంగా పెంచడంతో పాటు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఏకంగా 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారని గుర్తుచేశారు. ఆనాడు క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా గుడ్డిగా పెంపు చేపట్టడం వల్ల కొన్ని చోట్ల బహిరంగ మార్కెట్ విలువ కంటే అతి తక్కువగా, మరికొన్ని చోట్ల అత్యధికంగా ప్రభుత్వ విలువలు నమోదయ్యాయి. ఈ భారీ అంతరాల వల్ల క్రయవిక్రయదారులు భూ లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమగ్ర పునర్విమర్శకు శ్రీకారం చుట్టింది.

**ధరల నిర్ధారణలో ప్రామాణికాలు ఇవే..**

నూతన మార్కెట్ విలువల నిర్ణయంలో అనేక కీలక అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఆయా ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, రియల్ ఎస్టేట్ వృద్ధి రేటు, ఇటీవల జరిగిన ప్రభుత్వ భూముల వేలంలో పలికిన ధరలు, మార్కెట్ డిమాండ్ తదితర అంశాలను లోతుగా విశ్లేషించారు. ముఖ్యంగా కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులు, ఐటీ వృద్ధి కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు, మౌలిక వసతుల విస్తరణ శరవేగంగా జరుగుతున్న ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత పారదర్శకంగా రేట్లను హేతుబద్ధీకరించారు.

**అపార్ట్‌మెంట్లు, నిర్మాణ వ్యయాల సవరణలో పారదర్శకత**

ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, అసమానతలను ప్రస్తుత సర్కారు సరిచేసింది. గతంలో క్షేత్రస్థాయి మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నా, అంతస్తుల వారీగా ఫ్లాట్లకు అధిక రేట్లు వసూలు చేసేవారు. ఆ దోపిడీ విధానానికి స్వస్తి పలుకుతూ, ఒకే భవనంలోని అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తించేలా మార్కెట్ విలువలను సవరించారు. అంతేకాకుండా, ఇప్పటికే మార్కెట్ విలువ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా ఎలాంటి పెంపును ప్రతిపాదించలేదు.
మరోవైపు, నిర్మాణ రంగంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా భవన నిర్మాణ రిజిస్ట్రేషన్ వ్యయాలను కూడా సవరించారు. 2021 తర్వాత ఇనుము, సిమెంట్ లాంటి నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్‌సీసీ , నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల కనీస రేట్లను తాజా పరిస్థితులకు అనుగుణంగా మార్చారు. అనేక గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ అయిన పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ , క్యూర్ పరిధిలోని వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను పకడ్బందీగా నిర్ధారించారు.

“ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు దర్పణం పట్టేలా ఈ విలువల సవరణ చేపట్టాం. ఎంతో శ్రమించి తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, భూ లావాదేవీల్లో పారదర్శకతకు, ప్రభుత్వ ఆదాయ వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.”
**- రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి**