Mahaa Daily Exclusive

  భారత్-యూకే భాగస్వామ్యంలో సరికొత్త మైలురాయి….

Share

భారత్-యూకే భాగస్వామ్యంలో సరికొత్త మైలురాయి.
* అట్టహాసంగా ‘క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ’ ప్రారంభం.
* రూ. 33 వేల కోట్లతో జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్.
*కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక రంగాల అభివృద్ధికి ఊతమిచ్చేలా భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) దేశాల మధ్య వ్యూహాత్మక బంధంలో మరో కీలక అడుగు పడింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భారత్-యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ’ శాటిలైట్ కేంద్రాన్ని గురువారం న్యూఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, యూకే ఫారిన్ సెక్రటరీ ఇవెట్ కూపర్‌లు సంయుక్తంగా దీనికి శ్రీకారం చుట్టారు. 2025లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల నిర్ణయాల ఫలితంగా ఈ అబ్జర్వేటరీ కేంద్రం రూపుదిద్దుకోవడం విశేషం.
**ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక**
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, స్థిరమైన, అలాగే విశ్వసనీయమైన ఖనిజ సరఫరా వ్యవస్థను (సప్లయ్ చైన్) నిర్మించడంలో ఈ అబ్జర్వేటరీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ‘డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్’ రూపకల్పనకు ఈ వేదిక ఒక ముఖ్య కేంద్రంగా మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వివిధ పరిశ్రమలు, పరిశోధకులు, పెట్టుబడిదారులకు అవసరమైన విలువైన సమాచారాన్ని అందించే గ్లోబల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఇది ఎదుగుతుందని మంత్రి వివరించారు.
**‘వికసిత్ భారత్’ లక్ష్యంగా భారీ పెట్టుబడులు**
ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఖనిజాల వెలికితీత, అన్వేషణ (ఎక్స్‌ప్లొరేషన్), ప్రాసెసింగ్, రీసైక్లింగ్, నూతన ఆవిష్కరణలను మరింత బలోపేతం చేసే దిశగా 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33,000 కోట్లు) భారీ వ్యయంతో ‘జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్’ను ప్రారంభించినట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. అంతేకాకుండా, మినరల్స్ రీసైక్లింగ్‌ను ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు 180 మిలియన్ డాలర్లతో ఒక పథకాన్ని సైతం అమలు చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాలను సేకరించడం, విదేశాల్లో సైతం మినరల్స్ తవ్వకాలు జరపడం వంటి పనులను వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా 9 ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
**బ్రిటిష్ కంపెనీలకు ఆహ్వానం.. సరళీకృత సంస్కరణలు**
భారత క్రిటికల్ మినరల్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సిందిగా బ్రిటిష్ పరిశ్రమలకు, పెట్టుబడిదారులకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యూకే వద్ద ఉన్న అత్యాధునిక మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ట్రాక్షన్ టెక్నాలజీలు భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), రక్షణ, ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాల వేగవంతమైన ప్రగతికి ఎంతగానో తోడ్పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పారదర్శకమైన ఈ-వేలం విధానం, ప్రైవేట్ మరియు జూనియర్ మైనింగ్ కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, వేగవంతమైన అనుమతులతో పెట్టుబడులకు భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన దేశంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర గనుల శాఖ, ధన్‌బాద్‌లోని ఐఐటీ (ఐఎస్‌ఎం), టెక్స్‌మిన్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని టెక్నాలజీ ట్రాన్స్‌లేషన్ రీసెర్చ్ పార్క్, బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టాయి. ఈ అట్టహాస కార్యక్రమంలో యూకే విదేశాంగ శాఖ ప్రతినిధులు, బ్రిటిష్ హై కమిషన్ అధికారులు, కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రతినిధులతో పాటు భారత గనుల శాఖ ఉన్నతాధికారులు విశేషంగా పాల్గొన్నారు.