Mahaa Daily Exclusive

  పవన్ సభకు అనుమతిస్తే ఏమైతుండే..

Share

  • పవన్ సభకు అనుమతిస్తే ఏమైతుండే
  • తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ ఎప్పుడూ మాట్లాడలేదు
  • తెలంగాణ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అంటకాగడం లేదా
  • తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంను ఎందుకు దూరం పెట్టలేదు
  • మరోసారి సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపిన బీఆర్ఎస్, కాంగ్రెస్
  • తెలంగాణ అభివృద్ధిలో రెండు పార్టీలు విఫలమయ్యాయి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, మహా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్‌కి అనుమతి ఇస్తే ఏమవుతుంది..? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన రాంచందర్ రావు తెలంగాణ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా లవైఫల్యం చెందాయని, ఈ వైఫల్యాలపై ప్రజల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకే తెలంగాణ సెంటిమెంట్‌ని మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంని అధికారంలోకి రాగానే బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు దగ్గరకు తీసుకున్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారితో చేతులు కలిపింది ఎవరో..? బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని శక్తులతో అధికార రాజకీయాలు చేసింది ఎవరు..? అని నిలదీశారు. తెలంగాణను తిట్టిన వారిని, ఉద్యమకారులను అవమానించిన వారిని బీఆర్ఎస్‌లో చేర్చి పదవులు ఇచ్చింది ఎవరు..? అని ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో రాజకీయాలు చేసే ముందు మీ రాజకీయ చరిత్రను ఒకసారి ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద ప్రేమ ఉంటే డ్రామాలు కాదని… నిజాలు మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రజలు ఇప్పుడు భావోద్వేగాలకు కాదని, మీ గతానికి కూడా లెక్క అడిగే స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.

తెలంగాణను వ్యతిరేకించిన వారికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవులు ఇచ్చారని రాంచందర్ రావు ఆగ్రహించారు. ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ పెట్టలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ నిధులను పంజాబ్‌లో కేసీఆర్‌ పంచలేదా..? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేని పరిస్థితిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీజేపీ సపోర్ట్ చేయడంతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణను వ్యతిరేకించలేదా కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. ఉ్యమకారులపై లాఠీలతో దాడి చేసిన వారికి ఇప్పుడు ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారో కాంగ్రెస్ ప్రజలకు వివరించాలన్నారు.

పవన్ కల్యాణ్ జనసేన సభ కోసం అనుమతి అడిగారని, ఇచ్చి ఉంటే కథ అక్కడే ముగిసేదని, సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ సర్కార్ చెప్పాలని రాంచందర్ రావు ప్రశ్నించారు. ఈ సమావేశం పెట్టుకోవడం ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్య హక్కు అని చెప్పారు. దాన్ని ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. పవన్ కల్యాణ్ అంశాన్ని బీజేపీ మీద రుద్దే ప్రయత్నం చేయడం రాజకీయ దివాళాకోరుతనమని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిస్తేనే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.

కాంగ్రెస్ సర్కార్ ఇస్తానని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది..? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. 12 ఏళ్ల నుంచి నీళ్ల మీద ఒక పాలసీ కూడా ఎందుకు తేలేదని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా కంటే తక్కువ వాటాను కేసీఆర్ ఒప్పుకున్నారని ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను డీకే శివకుమార్‌కి.. రేవంత్‌రెడ్డి బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను అప్పుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సూపర్ హీరో అని రాంచందర్ రావు అభివర్ణించారు. బీజేపీ ఎవరితోనూ కలిసి వెళ్ళదని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని, పదవులు ఎవరికి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయన్నారు.