Mahaa Daily Exclusive

  కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు…

Share

  • కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు
  • 10 రోజుల్లో రాష్ట్రానికి
  • ఐఎండీ బిగ్ అప్డేట్..!

హైదరాబాద్, మహా : వేసవి తాపంతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు చల్లటి వార్త. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళంను తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ అధికారికంగా నిర్ధారించింది. దీంతో కేరళంలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే ఇవి క్రమంగా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు విస్తరించబోతున్నాయి. జూన్ రెండో వారంలో ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళంలో నైరుతి రుతుపవనాలు ఇవాళ ప్రవేశించాయి. దీంతో వర్షాకాలం (జూన్ – సెప్టెంబర్) ప్రారంభమైనట్లయింది. సాధారణంగా జూన్ 1వ తేదీన వచ్చే రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. వీటి ప్రభావంతో వచ్చే వారం కేరళలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళ నుంచి రుతుపవనాలు ఉత్తరం వైపు తెలంగాణలోకి ప్రయాణించడానికి సుమారు వారం సమయం పడుతుందని అంచనా. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమయ్యాయని పేర్కొంటూ, తెలంగాణ వ్యాప్తంగా వడగాలుల హెచ్చరికలను ఉపసంహరించుకుంటున్నట్లు ఐఎమ్‌డి నిన్న ప్రకటించింది. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, గోవా మొత్తానికి, మహారాష్ట్ర, అలాగే ఏపీలోని కొన్ని భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు, నైరుతి బంగాళాఖాతానికి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది.