కొత్త పార్టీ ప్రకటించిన అన్నామలై.
* తమిళనాడులో ‘కామన్ మ్యాన్’ పాలిటిక్స్.
* కల్ట్ రాజకీయాలకు చెక్.
* రాజీనామా ఆమోదించిన హైకమాండ్.
* 18 నెలలుగా విభేదాలు.
చెన్నై, మహా.
మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తాను కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ఉద్యమానికి తెరతీస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని, తన ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు వెళతానని తేల్చి చెప్పారు. తన ప్రథమ ప్రాధాన్యం తమిళనాడు అభివృద్ధేనని ఆయన ఉద్ఘాటించారు.
**రాజీనామా ఆమోదించిన హైకమాండ్‌కు కృతజ్ఞతలు**
తాను కేవలం మార్పు కోసమే బీజేపీలో చేరానని అన్నామలై గుర్తుచేశారు. తన రాజీనామాను ఆమోదించిన బీజేపీ హైకమాండ్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు.
**18 నెలలుగా విభేదాలు.. ముందే చెప్పా!**
తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని తాను ఎంతగానో ఆశించానని అన్నామలై తెలిపారు. అయితే గత 18 నెలలుగా బీజేపీతో తనకు విభేదాలు ఉన్నాయని, పార్టీకి తాను భారంగా మారకూడదనే ఉద్దేశ్యంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2025 డిసెంబర్ నెలలోనే తన రాజీనామా నిర్ణయాన్ని అధిష్ఠానానికి తెలియజేశానని, కేవలం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకే తాను పార్టీలో కొనసాగానని ఆయన కుండబద్దలు కొట్టారు.
**కల్ట్ పాలిటిక్స్‌కు స్వస్తి.. మార్పు కోసం కొత్త పార్టీ పక్కా!**
ఈ తరుణంలో కొత్త పార్టీ అవసరం ఉందా? అన్న ప్రశ్నకు అన్నామలై సూటిగా బదులిచ్చారు. “ఖచ్చితంగా అవసరమే. మనం ఒక షాపుకు వెళ్లి టూత్‌పేస్టో, బియ్యమో, కందిపప్పో కొనేటప్పుడు పది షాపులు తిరిగి ధర, నాణ్యత చెక్ చేసి మరీ కొంటాం.. ఎందుకంటే అవి మన శరీరంలోకి పోయేవి కాబట్టి. అలాగే, ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీ నాయకుడు ఎలాంటి వాడో ప్రజలు నిశితంగా గమనిస్తారు” అని ఆయన పేర్కొన్నారు.
దూరం నుంచి ప్రజలకు అభివాదం చేసే నాయకుల సంస్కృతికి తాము దూరమని, ‘కల్ట్ పాలిటిక్స్’ నుంచి రాజకీయాలు బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలను మారుస్తామని చెబుతూనే మళ్లీ పాత తరహా కల్ట్ పాలిటిక్సే చేస్తున్నారని ఆయన పరోక్ష విమర్శలు చేశారు. తాను ‘కామన్ మ్యాన్ పాలిటిక్స్’ ను ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కేవలం ముఖ్యమంత్రి మారినంత మాత్రాన వ్యవస్థలో మార్పు రాదని, సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ నిబద్ధత కలిగిన వాళ్లు ఉన్నప్పుడే అసలైన మార్పు సాధ్యమవుతుందని అన్నామలై ధీమా వ్యక్తం చేశారు.








