Mahaa Daily Exclusive

  ఎన్నికల పిటిషన్ లు ఏళ్ళ తరబడి పెండింగ్…

Share

  • ఎన్నికల పిటిషన్ లు ఏళ్ళ తరబడి పెండింగ్
  • సుప్రీంకోర్టుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి
  • ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని వ్యాఖ్య

చెన్నై, మహా : ఎన్నికల ఫలితాలకు సంబంధించి కింది కోర్టు తీర్పుపై అప్పీల్ సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో ఆరు నెలల్లోపు తీర్పు ఇవ్వాలని సుప్రీం స్వయంగా గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావించింది. వీటికి సుప్రీం కోర్టు కట్టుబడకపోతే దేశంలో నిరంకుశత్వానికి దారితీస్తుందని వ్యాఖ్యానించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేత ఇన్బదురై గెలుపును సవాలు చేస్తూ డీఎంకే నేత అప్పావు దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

2016 నాటి ఎన్నికల్లో ఇన్బదురై రాధాపురం నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే, ఈ ఫలితాన్ని అప్పావు మద్రాస్ హైకోర్టులో సవాలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని అన్నారు. మిడిల్ స్కూల్ హెడ్‌మాస్టర్లు అటెస్ట్ చేసిన పోస్టల్ బ్యాలెట్లు చెల్లవని అనడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. అప్పావు వాదనతో హైకోర్టు ఏకీభవించింది. మిడిల్ స్కూల్ హెడ్‌మాస్టర్లు కూడా గెజిటెడ్ ఆఫీసర్లేనని పేర్కొంది. వారు అటెస్ట్ చేసిన పోస్టల్ బ్యాలెట్‌లు చెల్లుతాయని పేర్కొంది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆధ్వర్యంలోనే మూడు ఈవీఎంలలోని ఓట్ల రీకౌంటింగ్‌ జరిగింది. అయితే ఓట్ల కౌంటింగ్ ఫలితం వెలువడక ముందే ఇన్బదురై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. అప్పీలుపై తుది తీర్పు మాత్రం దాదాపు ఆరేళ్ల పాటు పెండింగ్‌లో ఉండిపోయింది. ఇక మే 21న అప్పీలుపై విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టేను ఎత్తేసింది. అయితే, 2016 నాటి అసెంబ్లీ రద్దైపోయిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కేసులోని న్యాయపరమైన వివాదంపై తీర్పు వెలువరించడం అనవసరమని చెబుతూ అప్పీలును క్లోజ్ చేసింది.

ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సుప్రీం కోర్టు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల వివాదాలను ఆరు నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తావించింది. ప్రజాప్రతినిధుల చట్టంలోని స్ఫూర్తికి కట్టుబడి ఉండకపోతే ప్రజాస్వామ్యం బలహీనమవుతుందని వ్యాఖ్యానించింది. అందరికీ ఓటు హక్కు ఉండాలన్న స్ఫూర్తి దెబ్బతింటుందని పేర్కొంది. రాజ్యాంగానికి రక్షణగా ఉండే న్యాయవ్యవస్థ ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత్‌కు ఉన్న గౌరవాన్ని కాపాడాలని పేర్కొంది. ఇన్బదురై ఎన్నికను రద్దు చేస్తూ అప్పావును విజేతగా ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీ రికార్డుల్లో ప్రతి చోటా మార్పులు చేయాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది.