Mahaa Daily Exclusive

  భారత్ ‘ఏఐ’ భవితకు భారీ ఊతం….

Share

భారత్ ‘ఏఐ’ భవితకు భారీ ఊతం.
* రూ.2.50 లక్షల కోట్లతో ఎయిర్‌ట్రంక్‌ పెట్టుబడులు.
*ప్రధాని మోదీతో ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదా భేటీ.
* దేశంలో 5 గిగావాట్ల సామర్థ్యంతో సరికొత్త డేటా కేంద్రాల ఏర్పాటు.
*హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల్లో భారీగా విస్తరణ.
ఢిల్లీ, మహా.
భారతదేశాన్ని అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ హబ్‌గా మార్చే దిశగా ఓ చరిత్రాత్మక ముందడుగు పడింది. భారత డిజిటల్ భవితకు అత్యంత భారీ ఊతమిస్తూ, ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ డేటా సెంటర్ల సంస్థ ‘ఎయిర్‌ట్రంక్’ మనదేశంలో భారీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. రాబోయే నాలుగేళ్ల వ్యవధిలో ఏకంగా 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2.50 లక్షల కోట్లు) భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ చరిత్రాత్మక పరిణామంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఐదు గిగావాట్ల సామర్థ్యంతో సరికొత్త డేటా సెంటర్లను ఎయిర్‌ట్రంక్ నిర్మించనుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థకు బ్లాక్‌స్టోన్, కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ‘లుమినా క్లౌడ్‌ఇన్‌ఫ్రా’ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎయిర్‌ట్రంక్, తాజాగా ఈ సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఈ భేటీపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఇది అత్యంత భారీ పెట్టుబడి అని కొనియాడారు. ఈ ప్రాజెక్ట్ వల్ల దేశంలో లక్షలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా స్థానిక సప్లై చైన్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, క్లౌడ్ రంగంలో భారత్ తిరుగులేని గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఎయిర్‌ట్రంక్ సంస్థ ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్ నగరాల్లో 600 మెగావాట్ల సామర్థ్యంతో భారీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఈ తాజా రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడితో ఆ సామర్థ్యాన్ని మున్ముందు మరింతగా విస్తరించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రేసు తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశం కనబరుస్తున్న వేగం, పారదర్శక విధానాలు తమను ఎంతగానో ఆకర్షించాయని ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదా ఈ సందర్భంగా ప్రశంసించారు.
మరోవైపు, భారత్‌లో ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖపట్నం వేదికగా తన మొదటి ఏఐ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు 2026-2030 మధ్య కాలానికి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన విషయం విదితమే. వీటికి తోడుగా దేశీయ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ కూడా ఏఐ, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఏకంగా 100 బిలియన్ డాలర్లకు పైగా భారీ నిధులను కేటాయించాయి. దేశంలోకి వెల్లువెత్తుతున్న ఈ భారీ పెట్టుబడుల ప్రవాహం భవిష్యత్తులో డిజిటల్ రంగంలో భారత్‌ను తిరుగులేని అగ్రగామిగా నిలపబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.