త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ.
* పరిశీలనలో పాలిమర్ నోట్ల ప్రతిపాదన.
* ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా.
ముంబయి, మహా.
దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు చలామణిలోకి రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాట వాస్తవమేనని, అయితే ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా పేపర్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్‌బీఐ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కాగితపు నోట్ల ముద్రణకు భారీగా ఖర్చు అవ్వడం, అవి త్వరగా పాడైపోయి చలామణి నుంచి తొలగించాల్సి రావడం వంటి కారణాలతోనే ఈ ప్రత్యామ్నాయంపై ఆర్బీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు వాటి ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక, నిర్వహణపరమైన సవాళ్లపై ఆర్బీఐకి చెందిన నిపుణుల బృందం లోతుగా అధ్యయనం చేస్తోంది.
నిజానికి, ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన రావడం ఇదే తొలిసారి కాదు. 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై పార్లమెంటుకు సమాచారం అందించింది. దేశంలోని భౌగోళిక, వాతావరణ వైవిధ్యాలను పరీక్షించడానికి ప్రయోగాత్మకంగా ఐదు నగరాలను (కొచ్చి, మైసూరు, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్) ఎంపిక చేసింది. ఆయా ప్రాంతాల్లో రూ.100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని అప్పట్లో భావించారు. కానీ, కొన్ని సాంకేతిక, నిర్వహణ లోపాల వల్ల ఆ ప్రాజెక్టు అప్పట్లో తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ఆర్‌బీఐ మళ్లీ ఈ పాత ఫైల్‌ను కదిలించడంతో త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తాయనే ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి.








