ప్రగతి శిఖరాగ్రాన ‘వికసిత్ భారత్.
(గడల నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్, ఖమ్మం)
అవినీతి పంకిలంలో కూరుకుపోయి, విధానపరమైన పక్షవాతంతో కునారిల్లిన జాతి, నేడు ప్రపంచ యవనికపై సగర్వంగా, సమున్నతంగా తలెత్తుకుని నిలబడింది. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఒక సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన క్రాంతిదర్శి నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టేనాటికి దేశం ముందు ఎన్నో పెను సవాళ్లు. కానీ, దశాబ్దానికి పైగా సాగిన ఆ అవిశ్రాంత ప్రయాణం నేడు భారత మాతను ‘గ్లోబల్ లీడర్’గా నిలబెట్టింది. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ కలలుగన్న ‘అంత్యోదయ’ స్ఫూర్తిని రగుల్చుతూ, బడుగు, బలహీన వర్గాల కన్నీరు తుడవడమే ఏకైక లక్ష్యంగా ఎన్డీయే సర్కారు సాగించిన ఈ సుపరిపాలన భారతీయ చరిత్రలో అక్షరాలా ఒక స్వర్ణయుగం.
గత పన్నెండేళ్లలో ఎన్ని అంతర్జాతీయ సంక్షోభాలెదురైనా, ప్రపంచ అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలు సైతం మాంద్యపు కోరల్లో చిక్కుకుని వణికిపోయినా.. భారత ఆర్థిక పునాదులు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఒకప్పుడు విదేశీ సాయం కోసం అర్థిస్తూ ఎదురుచూసిన దీనస్థితి నుంచి, నేడు ఆయా దేశాలకు ఆర్థిక దిశానిర్దేశం చేసే మహోన్నత స్థాయికి మనం ఎదిగాం. ఆర్థిక ప్రగతిలో అగ్రశ్రేణికి పరుగులు తీస్తూ, 2026 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా 4.15 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐఎంఎఫ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ (4.26 ట్రిలియన్ డాలర్లు) తో అత్యంత తీవ్రంగా పోటీ పడుతూ ప్రపంచ ఆర్థిక శక్తుల సరసన భారత్ సగర్వంగా నిలబడనుంది.
పేదరిక నిర్మూలనలోనూ ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయం యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, 2011 నుంచి 2023 మధ్య కాలంలో ఏకంగా 17.1 కోట్ల మంది భారతీయులు తీవ్రమైన పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు. దారిద్ర్య రేఖ దిగువన మగ్గుతున్న వారి శాతం 16.2 నుంచి కేవలం 2.3 శాతానికి పడిపోవడం దరిద్ర నారాయణుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన చిత్తశుద్ధికి నిలువెత్తు దర్పణం.
అవినీతి రహిత పాలనకు, పారదర్శకతకు జన్-ధన్ యోజన అక్షరాలా ఒక బ్రహ్మాస్త్రంలా పరిణమించింది. దశాబ్దాలుగా పేదవాడి రక్తాన్ని జలగల్లా పీల్చిన దళారీ వ్యవస్థకు చరమగీతం పాడుతూ, నేరుగా లబ్ధిదారులకే ఫలాలు అందించేలా ‘జామ్’ ( జన్ ధన్, ఆధార్, మొబైల్) త్రయం సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన ఈ విప్లవాత్మక మార్పుల వల్ల రికార్డు స్థాయిలో 57.78 కోట్ల జన్-ధన్ ఖాతాలు తెరుచుకోగా, అందులో 55 శాతానికి పైగా మహిళలవే కావడం నారీశక్తి సాధికారతకు ప్రతీక.
ఈ ఖాతాల్లో పేదలు దాచుకున్న సొమ్ము ఏకంగా రూ.1.46 లక్షల కోట్లు దాటడం విశేషం. దళారుల ప్రమేయం సమూలంగా నిర్మూలించబడటం వల్ల 2023 నాటికి ప్రభుత్వ ఖజానాకు రూ.3.48 లక్షల కోట్లు ఆదా కావడం పాలకుల నిజాయితీకి నిదర్శనం. డిజిటల్ చెల్లింపుల విషయానికి వస్తే, యూపీఐ సృష్టించిన సునామీతో భారత్ నేడు ప్రపంచాన్నే శాసిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 24,161 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. ప్రపంచ రియల్ టైమ్ పేమెంట్స్‌లో 49 శాతం వాటా ఒక్క మనదే కావడం గర్వకారణం. దీనికి తోడు యువతను జాతి నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ ‘స్టార్టప్ ఇండియా’ ద్వారా 23.3 లక్షల మందికి ఉపాధి కల్పించడం నవ భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం.
మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్డీయే ప్రభుత్వం మునుపెన్నడూ చూడని రీతిలో పాత రికార్డులను చెరిపేసింది. 2014 నాటికి 91,287 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులు నేడు 1,46,572 కిలోమీటర్లకు విస్తరించి దేశం నలుచెరుగులా అభివృద్ధి పరుగులకు బాటలు వేశాయి. ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం ఏకంగా 3,052 కిలోమీటర్లకు పెరగడం రవాణా రంగంలో ఒక పెను విప్లవం. పర్యావరణ హిత రవాణాలో భాగంగా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఇప్పటికే 99.6 శాతం విద్యుదీకరణ పూర్తి చేసి యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
మరోవైపు ప్రజా సంక్షేమంలో ఈ దశాబ్ద కాలం ఒక మహా యజ్ఞంలా సాగింది. ఆత్మగౌరవ ప్రతీకలుగా స్వచ్ఛ భారత్ ద్వారా గ్రామీణ భారతంలో 12.11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. దీనివల్ల ప్రాథమిక పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్ రేటు 4.6 శాతం నుంచి 0.3 శాతానికి పడిపోయింది. అలాగే, అడుగడుగునా జీవామృతాన్ని పంచుతూ జల్ జీవన్ మిషన్ కింద కేవలం ఐదారేళ్లలో 12.58 కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం అద్భుతమైన విజయం.
పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ పీఎం ఆవాస్ యోజన కింద గ్రామ, పట్టణ ప్రాంతాల్లో కలిపి కోట్లాది పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దేశానికి వెన్నెముకైన రైతులకు ఆపద్బాంధవుడిగా నిలుస్తూ పీఎం కిసాన్ కింద అన్నదాతలకు రూ.4.27 లక్షల కోట్లు జమ చేశారు. ఆయుష్మాన్ భారత్ కింద 42 కోట్ల మందికి సంజీవని లాంటి హెల్త్ కార్డులు ఇచ్చి, రూ.1.80 లక్షల కోట్ల ఉచిత వైద్యం అందించడం స్వతంత్ర భారత చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంచలనం.
ఒకవైపు ఎన్డీయే కూటమి తన అభివృద్ధి అజెండాతో, తిరుగులేని ప్రజాదరణతో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతుంటే, మరోవైపు సిద్ధాంతపరమైన దిశానిర్దేశం లేని ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘ఇండియా కూటమి’ సమావేశం అక్షరాలా ఒక రాజకీయ ప్రహసనంగానే మిగిలిపోయింది. నీట్ పరీక్షల లీకేజీ కుంభకోణాన్ని సాకుగా చూపి, నిరుద్యోగం పేరుతో మొసలి కన్నీరు కారుస్తూ అఖిలపక్ష సమావేశం కావాలని డిమాండ్ చేస్తున్న విపక్షాల తీరు వారి దివాళాకోరుతనానికి నిదర్శనం.
పైకి ఐక్యతా రాగాలు ఆలపిస్తున్న ఈ కూటమిలో లోపల మాత్రం కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. బెంగాల్ రాజకీయాల్లో ఒకరినొకరు బద్ధ శత్రువులుగా చూసుకునే మమతా బెనర్జీ, సోనియా గాంధీలు ఢిల్లీ వేదికపై ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం వెనుక.. కేవలం తమ రాజకీయ ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకునే ఆరాటమే సుస్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు, తమిళనాడు రాజకీయ సమీకరణాలు ఈ కూటమి పునాదులనే కుదిపేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు సాధించి సత్తా చాటిన హీరో విజయ్ పార్టీకి కాంగ్రెస్ అనూహ్యంగా మద్దతు ప్రకటించడం డీఎంకే కు ఏమాత్రం మింగుడుపడటం లేదు. దశాబ్దాలుగా విశ్వసనీయ మిత్రపక్షంగా ఉన్న తమకు కాంగ్రెస్ ‘చారిత్రక వెన్నుపోటు’ పొడిచిందని రగిలిపోతున్న డీఎంకే.. ఇండియా కూటమి సమావేశాలను బహిష్కరించడం వారి ఐక్యతలోని డొల్లతనాన్ని యావత్ దేశం ముందు బట్టబయలు చేసింది.
గత పన్నెండేళ్ల ఎన్డీయే పాలన దేశాన్ని దారిద్ర్యపు చీకట్ల నుంచి ప్రగతి వెలుగుల వైపు నడిపించిన ఒక నవ శకం. నిత్యం అబద్ధాలతో, అంతర్గత కుమ్ములాటలతో, ద్వేషపూరిత రాజకీయాలతో కాలం వెళ్లదీస్తున్న ప్రతిపక్షాల పగటి కలలను, కుట్రలను దేశ ప్రజలు ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. పేదరికం లేని, సర్వతోముఖాభివృద్ధి సాధించిన అఖండ, సంపన్న భారతదేశమే అంతిమ లక్ష్యంగా మోదీ సర్కారు వేస్తున్న అడుగులు నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ‘వికసిత్ భారత్’ సాధనలో ఈ ప్రభుత్వ దార్శనికత, ఉక్కు సంకల్పం దేశాన్ని మరింత సమున్నత శిఖరాలకు చేర్చడం ముమ్మాటికీ చారిత్రక సత్యం.







