Mahaa Daily Exclusive

  సెప్టెంబరు నెల శ్రీవారి దర్శన, సేవా టికెట్ల షెడ్యూల్ ఖరారు…

Share

 

తిరుమల:మహా.

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. వచ్చే సెప్టెంబరు నెలకు సంబంధించిన స్వామివారి ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. పక్కా ప్రణాళికతో భక్తులు తమ టికెట్లను ముందుగానే బుక్ చేసుకునేలా ఈ తేదీలను వెల్లడించింది.

భక్తులు అత్యంత పవిత్రంగా భావించే స్వామివారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవల టికెట్ల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ప్రారంభించనుంది. ఈ సేవల కోసం భక్తులు జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో అదృష్టవంతులైన భక్తులకు ఈ టికెట్లను కేటాయిస్తారు.

అనంతరం శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక శ్రీవారి భక్తులు ఎంతో విశేషంగా ఆచరించే అంగప్రదక్షిణ టోకెన్లను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు (జూన్ 23న) మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక దర్శన కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

సాధారణ భక్తులు అత్యధికంగా వినియోగించుకునే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన (శీఘ్ర దర్శనం) టికెట్ల కోటాను జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తుల కోసం అదే రోజు (జూన్ 24న) మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో బస చేసేందుకు వసతి గదుల కోటాను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/ ద్వారా మాత్రమే భక్తులు తమ సేవా టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.