Mahaa Daily Exclusive

  నీట్​ ఆందోళన

Share

  • విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ లను ఉపసంహరించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది
  • తీవ్రమైన నేర చరిత్ర లేకపోతే కేసులను ఉపసంహరించుకోవచ్చన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మహా : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్​ఐఆర్​లపై సోమవారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారణ చేసింది. ‘నేర చరిత్ర’ అనే పదం కేవలం తీవ్రమైన, హేయమైన నేరాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అందువల్ల నీట్​ పేపర్ లీక్​కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గతంలో తీవ్రమైన, హేయమైన నేర చరిత్ర లేనట్లయితే, వారిపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను దిల్లీ సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు మూసివేయవచ్చని, లేదా ఉపసంహరించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

విచారణ ప్రారంభంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ, “నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై ఎఫ్​ఐఆర్​లను కొనసాగించకూడదనే విషయంలో కేంద్రం పూర్తి నిబద్ధతతో ఉంది. అయితే తీవ్రమైన, హేయమైన నేర చరిత్ర ఉన్న 2,700 మందికిపైగా వ్యక్తులపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను ఉపసంహరించుకునేది లేదు” అని అన్నారు. మరోవైపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్​ తన వాదనలు వినిపిస్తూ, నిరసనల సమయంలో న్యాయవాదుల పిల్లలను కూడా పోలీసులు కొట్టారన్నారు. “ఆ వీడియోలు చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. మేము కోర్టుకు 300 వీడియోలను ఇచ్చాం. ఉన్నతాధికాల నుంచి ఆదేశాలు వచ్చినందున, పోలీస్ కమిషనర్​ వీటన్నింటినీ పరిశీలించాలి. విద్యార్థులపై దురాగతాలకు పాల్పడిన యూనిఫామ్ లేని వ్యక్తులను మేము గుర్తించాం. పోలీసులు పెల్లెట్ గన్​లు మొదలైనవి ఎందుకు ఉపయోగించారనే దానిపై పోలీస్ కమిషనర్​, ఆర్​ఏఎఫ్ డైరెక్టర్​కు ఆదేశాలు ఇవ్వాలి” అని న్యాయవాది గోపాల్ శంకర్​నారాయణన్​ అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కేవలం ఆందోళన జరుగుతుందనే కారణంతో పోలీసుల దురాగతాలను లేదా లాఠీ ఛార్జిని సమర్థించలేమని స్పష్టం చేసింది. శాంతియుత నిరసన తెలిపే హక్కు అందరికీ సంపూర్ణంగా ఉంటుందని నొక్కి చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.