- బంకీపూర్ ఉప-ఎన్నికల్లో పీకే గెలుపు
- తొలిసారి పోటీచేసి విజయం సాధించిన ప్రశాంత్ కిషోర్
- నితిన్ నబీన్ రాజీనామాతో బంకీపూర్‌లో ఉప-ఎన్నిక
- 1995 నుంచి ఈ స్థానంలో వరుసగా బీజేపీ గెలుపు
పాట్నా, మహా : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష ఎన్నికల తొలి పోరులో విజయం సాధించారు. బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ఆయన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి అయిన నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేల ఓట్లకుపైగా మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ విజయంతో ఆయన తొలిసారి చట్ట సభల్లో అడుగుపెట్టనున్నారు. బంకీపూర్ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబిన్ 2026 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. నితీన్ నబిన్ అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన నీరజ్ కుమార్ సిన్హా బీజేపీ తరఫున పోటీ చేయగా.. ఆర్జేడీ తరఫున రేఖా కుమారి గుప్తా పోటీ చేశారు. జులై 30న ఈ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించగా సోమవారం ఫలితాలను వెల్లడించారు.
2008 నియోజవకర్గాల పునర్విభజన అనంతరం బంకీపూర్ నియోజకవర్గం ఏర్పాటైంది. అంతకు ముందు ఇది పట్నా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. 2006 ఎన్నికలు మొదలు.. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు.. నితీన్ నబిన్ వరుసగా ఐదుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు 1995 నుంచి 2005 వరకు బీజేపీ నేత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారంలో ఉండటం, తమ పార్టీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గంలో మరోసారి గెలవడం ఖాయమని బీజేపీ నేతలు భావించారు. కానీ ప్రశాంత్ కిశోర్ రూపంలో వారికి ఊహించని భంగపాటు ఎదురైంది. మొత్తం 31 రౌండ్ల ఉండగా.. తొలి రౌండ్‌లోనే బీజేపీ అభ్యర్థిపై పీకే 862 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.. తర్వాత రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. ఐదు రౌండ్లలో 3451 మెజార్టీ సాధించిన పీకే.. 18 రౌండ్లు ముగిసే సరికి 10వేలకు ఓట్లకుపైగా ఆధిక్యాన్ని సంపాదించారు.







