• 38 మందికి లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్.
ఢిల్లీ, మహా.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే కీలక బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఉన్న మొత్తం 34 మంది న్యాయమూర్తుల సంఖ్యను 38కు పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు–2026ను విపక్షాల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది.
లోక్‌సభ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచే నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాల చోరీ ఆరోపణలు, విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ వంటి అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పలుమార్లు సభ వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును సభలో ప్రవేశపెట్టి దాని ఉద్దేశాన్ని వివరించారు.
బిల్లుపై చర్చలో పాల్గొనాలని, సభా సంప్రదాయాలను గౌరవించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించారు. దీంతో బిల్లును మూజువాణి ఓటుకు పెట్టగా సభ ఆమోదించింది. అలాగే కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ విపక్షం ప్రవేశపెట్టిన చట్టబద్ధ తీర్మానాన్ని కూడా సభ తిరస్కరించింది.
ఈ సవరణతో ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అనుమతించిన సంఖ్య 33 నుంచి 37కు పెరగనుంది. ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం సంఖ్య 38కు చేరుతుంది. సుప్రీంకోర్టులో పెరుగుతున్న పెండింగ్ కేసులు, న్యాయమూర్తులపై అధిక పనిభారం తగ్గించడం, కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇదిలా ఉండగా, భారతీయ గణాంక సంస్థ (ఐఎస్‌ఐ)కు సమగ్ర చట్టపరమైన వ్యవస్థను కల్పించే భారతీయ గణాంక సంస్థ బిల్లు–2026ను కూడా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కొత్త చట్టం ప్రకారం భారత రాష్ట్రపతి ఐఎస్‌ఐకి విజిటర్‌గా వ్యవహరించనుండగా, సంస్థ నిర్వహణ కోసం ఛైర్మన్ నేతృత్వంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏర్పాటు చేయనున్నారు. విద్య, పరిశోధన, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, పరిమాణాత్మక ఆర్థిక శాస్త్రం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సంస్థను మరింత బలోపేతం చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.







