- నేటి నుంచి శబరిమల పునఃప్రారంభం.
- మిథున మాస పూజలకు సర్వం సిద్ధం.
శబరిమల,మహా.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, భక్తకోటి కొంగుబంగారం శబరిగిరీశుడు అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల పుణ్యక్షేత్రం నేటి నుంచి భక్తుల దర్శనార్థం పునఃప్రారంభం కానుంది. పవిత్రమైన మిథున మాస పూజల నిమిత్తం ఆలయ తలుపులను తెరిచేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అన్ని ఏర్పాట్లను సర్వాంగ సుందరంగా పూర్తి చేసింది. నెలవారీ పూజల్లో భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
ఆలయ సంప్రదాయాల ప్రకారం.. ప్రధాన తంత్రి కందరారు మహేష్ మోహనారు పర్యవేక్షణలో ఆదివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు పవిత్ర గర్భగుడి ద్వారాలను లాంఛనంగా తెరవనున్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు (మేల్‌శాంతి) ఈ.డి. ప్రసాద్ తన చేతుల మీదుగా గర్భాలయంలో స్వామివారికి పవిత్ర దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆ తర్వాత నుంచి భక్తులను 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం బోర్డు ఆన్‌లైన్ వర్చువల్ క్యూ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్యూ విధానం ద్వారా ముందుగా నమోదు చేసుకున్న భక్తులకు సాఫీగా, వేగంగా దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ మిథున మాస నెలవారీ ప్రత్యేక పూజలు జూన్ 19వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఐదు రోజుల పాటు పడిపూజ, ఉదయ అస్తమయ పూజ తదితర విశేష పూజలు అందుకున్న అనంతరం.. 19వ తేదీ రాత్రి చివరి పూజ (హరివరాసనం) ముగిశాక భక్తులకు వీడ్కోలు పలికి తలుపులు మూసివేయనున్నారు.








